హైదరాబాద్, సెప్టెంబర్11(నమస్తే తెలంగాణ): ‘ఎన్ఐటీ.. ఐఐటీ.. పాలిటెక్నిక్‌లు.. నెహ్రూ పెట్టింది మరచిపోతిరి.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతంటిరీ.. ఢిల్లీపోయి కన్నీరు కార్సి వస్తిరి.. పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు బట్టి వొకితే.. మీకు ఇంత కరుణ లేకపాయె.. చట్టం, ప్రజాస్వామ్యం ఎకడున్నది’ అంటూ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన పాట ద్వారా పాలకులను సూటిగా నిలదీశారు. శుక్రవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలకు ఉన్న అత్యంత విలువైన భూములపై కన్నేసి ప్రైవేటీకరణ కుట్రలు జరుగుతున్నాయా? అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు.
ఐఐటీ, ఎన్ఐటీలు తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ అని, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మడకశిర వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పారని గుర్తుచేశారు. జంతర్ మంతర్‌లో జెన్‌జీ విద్యార్థుల పోరాటానికి రాహుల్‌గాంధీ స్వయంగా వెళ్లి మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. సిల్ యూనివర్సిటీ వస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ ఉన్న పాలిటెక్నిక్ వ్యవస్థను ఎందుకు మార్చాల్సి వస్తున్నదని ప్రశ్నించారు. నెహ్రూ- గాంధీల ఆలోచన ఒకరకంగా ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు ఇంకో తీరుగా ఉన్నాయని విమర్శించారు. ‘కేంద్రంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలు.. దానికి అనుగుణంగా ఇకడ మీ పాలసీలు మారిపోతాయి. ఒకటి కాదు, అన్ని రంగాల్లోనూ ఇదే తంతు నడుస్తున్నద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వెనుక ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తులేవో అర్థం కావడం లేదని విమర్శించారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు థియరీ తప్ప నైపుణ్యం ఉండదనే ప్రభుత్వ వాదన ఏమాత్రం శాస్త్రీయమైనది కాదని కొట్టిపారేశారు. ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో దాదాపు 80% మంది పాలిటెక్నిక్ చదివినవారేనని చెప్పారు. ప్రైవేటీకరణతోనే అంతర్జాతీయ ప్రమాణాలు వస్తాయనుకోవడం సరికాదని, సాంకేతిక రంగంలో మేటిగా నిలిచిన జర్మనీలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేవని వివరించారు. గతంలో యూపీఏ సర్కార్‌లో విద్యాశాఖ మంత్రి అర్జున్‌సింగ్ ప్రైవేటీకరణపై సింహంలా గర్జించారని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ యశ్పాల్ ఏకంగా 1,200 ప్రైవేట్ కాలేజీలను రద్దు చేయించారని, ఉమ్మడి రాష్ట్రంలో కే కేశవరావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ ప్రైవేటీకరణను అంగీకరించలేదని గుర్తుచేశారు. కానీ, నేడు ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారని, అదానీ, అంబానీలు వచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పలు ప్రచారం చేసుకొంటున్నారని దుయ్యబట్టారు.