హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. దీనికి బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆగమేఘాల మీద 10% రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ప్రభుత్వం, బీసీలు 30 ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రాజకీయరంగంలో బీసీల ప్రాతినిధ్యం 14% దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, 29 రాష్ర్టాల్లో 16 రాష్ర్టాల నుంచి ఒక బీసీ పార్లమెంట్ సభ్యుడు కూడా లేడని, గత లోక్‌సభ 545 సభ్యుల్లో బీసీలు కేవలం 96 మంది మాత్రమేనని వాపోయారు. విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన చేపట్టాలని కోరారు. సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగగా, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, బీహెచ్ హనుమంతరావు, బడుగుల లింగయ్య, మహేందర్, కర్రీ వేణుమాధవ్, నీల వెంకటేశ్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, పృథ్వీగౌడ్, డాక్టర్ పద్మలత, కృష్ణమూర్తి, ఉదయ్‌నేత, రవీందర్, శివ, కిరణ్ భాషయ్య, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.