హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రోజురోజుకూ తీవ్రతర మవుతున్న ఎరువుల సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డాను పార్లమెంట్‌లోని ఆయన చాంబర్లో కలిశారు. యూరియా కోసం తెలంగాణ రైతులు పడుతున్న కష్టాలను ఏకరువుపెట్టారు. వెంటనే తెలంగాణ సాగు అవసరాలకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించేందుకు అంగీకరించినట్టు వెల్లడించారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేసిందని పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. మార్పు తెస్తామని పదే పదే చెప్పిన కాంగ్రెస్ డొల్లతనం యూరియా కొరతతో తేలిపోయిందని ఎద్దేవాచేశారు. ఏపీ సర్కారు నిర్మిస్తున్న బనకచర్లను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని స్పష్టంచేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోటాపై కాంగ్రెస్ నాటకాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎత్తిచూపామని వెల్లడించారు.