ఖమ్మం, డిసెంబర్ 29: తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారంపై కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావించినా ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని రెండేండ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినా ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.