సూర్యాపేట టౌన్, జనవరి 21 : బీఆర్ఎస్ పార్టీపై సంస్కార హీనంగా మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. వీధి రౌడీని తలపించేలా రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ముడుపులు చెల్లించి పదవులు తెచ్చుకొంటారని, నీతిమాలిన మాటలు మాట్లాడటం రేవంత్‌రెడ్డికి సరికాదని అన్నారు. ‘నీ బతుకేంటో మీ పార్టీ నేతలు కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడో చెప్పారు’ అని గుర్తుచేశారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయగలరా? అని ప్రశ్నించారు.
అడ్డగోలుగా మాట్లాడటం ఆపి ఆరు గ్యారెంటీలు, సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కచ్చితంగా కొట్లాడుతామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణను రోల్‌మోడల్ చేసింది కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ (కేఆర్బీఎం)కు వ్యతిరేకంగా కొట్లాడాలని సూచించారు. విభజన హామీలపై, తెలంగాణ అభివృద్ధిపై కొట్లాడింది తామేనని స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిని డెడ్ స్టోరేజీ వరకు వచ్చినా తాము రైతులకు నీళ్లు అందించామని, ఇంకా 15 టీఎంసీలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇప్పుడు ఆయకట్టుకు నీళ్లు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దే మెజార్టీ అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.