Mock Assembly | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం పాత్ర పోషించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, హామీల అమలుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని, అయితే ఏ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పలేదంటూ తలసాని వ్యాఖ్యానించారు.
“మేము 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో అని చెప్పామా? ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు మేమే ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం” అంటూ మాక్ అసెంబ్లీలో తలసాని వ్యంగ్యంగా మాట్లాడారు. సభలో సభ్యులు సబ్జెక్ట్ తప్ప ఏమైనా మాట్లాడుకోవాలని సూచించారు. “నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఢిల్లీతో సమస్య, పార్టీలో సమస్య.. ఆఖరికి బీఆర్ఎస్తో కూడా ప్రశాంతత లేదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరాగాంధీ నిర్మించారని చెప్పడం ద్వారా తలసాని శ్రీనివాస్ సభలో నవ్వులు పూయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.