హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రూ లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2500 ఇచ్చారని ప్రశ్నించారు. రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారన్నారు. ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారని, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారని నినదించారు. 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పుచేసినా అభిమాత్రం సున్నా అని విమర్శించారు.
అనంతరం మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం పాస్ చేయించుకోవడమే జరుగుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చేవన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తూతూ మంత్రంగా సభను నడిపిస్తున్నరని, పనిగంటలు తగ్గించారన్నారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజా క్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు.
15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేశామని చెబుతున్నారని, 9 ఏంళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 4 లక్షల 17 వేల కోట్లు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే లక్ష 58 వేల కోట్ల అప్పు చేశారని, పదే పదే ప్రజల్లో కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది సభను, ప్రజలను తప్పు పట్టించడమేమనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అప్పుకు కరెక్ట్ లెక్కలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై ఈ రోజు ప్రభుత్వం చేసిన అప్పులను ఎండగడుతామన్నారు.