బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లను అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదు. ‘మేమెంతో- మాకంత’ అన్నట్టుగా అవకాశం దక్కేంతవరకూ సుదీర్ఘ పోరాటానికైనా బీసీలు సన్నద్ధం కావాలి.
– సిరికొండ మధుసూదనాచారి
కవాడిగూడ, నవంబర్ 13: బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లను అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఒప్పుకొని తీరాలని, బీసీల న్యాయమైన కోర్కెను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ‘మేమెంతో- మాకంత’ అన్న అవకాశం దక్కేంతవరకూ సుదీర్ఘ పోరాటానికైనా సన్నద్ధం కావాలని బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ల సాధనకు క్ష్రేత్రస్థాయి నుంచి బలమైన పునాదులతో ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు దక్కినప్పుడే అందరం ఒక్కటేనన్న భావన వస్తుందని చెప్పారు. విద్యా-ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో బీసీ జేఏసీ కోఆర్డినేటర్లు గుజ్జ కృష్ణ, కులకచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో మధుసూదనాచారితోపాటు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, అద్దంకి దయాకర్, కోదండరాం, నాయకులు మధుయాష్కీగౌడ్, జూలూరి గౌరీశంకర్, గిరిజన నేత సంజీవనాయక్, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, ప్రొఫెసర్లు సంగని మల్లేశ్వర్, బాగయ్య, వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
దీక్షనుద్దేశించి మధుసూదనాచారి మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య సౌధానికి పునాదిరాళ్లు బీసీలేనని చెప్పారు. ప్రభుత్వాల ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్ర పోషించింది బీసీలేని తెలిపారు. ప్రజల కోర్కెలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని తెలిపారు. బీసీల న్యాయసమ్మతమైన ఈ కోరికను అర్థం చేసుకొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు సహకరిస్తున్నారని చెప్పారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు క్పలించడం అందరికీ న్యాయసమ్మతేనని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జనాభా ఉన్నప్పుడు, బీసీలు వెనుకబడి ఉన్నారని కమిషన్లు తేల్చి చెప్పినప్పుడు, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటే తప్పులేనే లేదని చెప్పారు. బీసీ వాటా ఆ వర్గానికి దక్కితేనే దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో తాను మాట్లాడతానని చెప్పారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో కూడా సరైన వాటా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. బీసీల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీతో కొట్లాడతారో బీసీల ముందు దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తారని హెచ్చరించారు. బీసీ ఉద్యమంలో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో వేలాది మంది గురువారం ధర్మదీక్షలో పాల్గొన్నారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లను సాధించే క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు పోరాడతారని, 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. బీసీ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బీసీల ధర్మపోరాట దీక్షలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామి, మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, ఉప్పరి శేఖర్ సగర, కౌలే జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటులో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పాసైతేనే రిజర్వేషన్లు దక్కుతాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆ హక్కు కోసం రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో బీసీ వాదం బలంగా ఉన్నదని, అందుకే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్క ఉద్యమాన్ని నడిపించింది బీసీలేనని, తెలంగాణ ఉద్యమాన్ని సైతం బీసీలే బుజాలమీద మోశారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను సాధించుకునే క్రమంలో మనం పోరాటంలో జేఏసీని తప్పుదోవ పట్టించేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఐక్యతను వీడొద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయిని చెప్పారు. రిజర్వేషన్ల సాధనకై ధర్మపోరాట దీక్షతో పటిష్ఠమైన పోరాటం మొదలైందని, దీన్ని ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.