హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాల్లో మోదీకి ముందు ఈడీ రావటం సహజమేనని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలున్నాయి కాబట్టే దర్యాప్తు సంస్థలు వరుస కడుతున్నాయని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నాయని ఆమె విమర్శించారు.
బాధ్యత కలిగిన పౌరురాలిగా తాను ఈడీ విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు ఇస్తానని చెప్పారు. ‘మేం ఏ తప్పూ చేయలేదు. కాబట్టే విచారణకు వస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కూడా సిట్ ముందు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణకు వచ్చి సిట్ ముందు హాజరై ప్రశ్నలకు జవాబులు చెప్పమని బీఎల్ సంతోష్‌కు సూచించండి. ఆయన ఎందుకు భయపడుతున్నారు? కోర్టులో కేసుల మీద కేసులు వేసి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రజలు వీటన్నింటి గురించి ఆలోచించాలని కోరారు. ‘వన్ నేషన్ – వన్ ఫ్రెండ్’ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని, ప్రజల గురించి ఆలోచించే విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ఇప్పుడు మహిళా బిల్లుపై ధర్నా చేస్తున్నందుకు నాకు ఈడీ నోటీసులు అం దాయి. రేపు గ్యాస్ ధర పెంపు పోరాటం చేస్తే.. ఇంకొకరిని ఈడీ పిలుస్తుంది. అదానీ విషయం తెరమీదికి వస్తే.. మరొకరికి నోటీసులు వస్తాయి’ అని కవిత మండిపడ్డారు. ఈడీ నోటీసులు ఇచ్చినా తాను ధర్నా విరమించదలచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
మహిళా బిల్లు కోసం ధర్నాకు సంబంధించి ఈ నెల 2న హైదరాబాద్‌లో పోస్టర్ రిలీజ్ చేశామని కవిత చెప్పారు. భారత జాగృతి తరఫున 29 రాష్ర్టాల్లోని అన్ని సంస్థలకు ఆహ్వానం పంపించామని వెల్లడించారు. దాదాపు 6 వేల మందికిపైగా దీక్షకు హాజరవుతామని చెప్పినట్టు తెలిపారు. 18 పార్టీలు తమ ప్రతినిధులను పంపుతామని చెప్పాయని పేర్కొన్నారు. తనతోపాటు 500-600 మంది దీక్షలో కూర్చుంటారని చెప్పారు. సీతారాం ఏచూరీ చేతుల మీదుగా దీక్ష ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ‘ఈ సెషన్ నుంచి వచ్చే సెషన్ వరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు కొనసాగుతాయి’ అని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి వరుసగా దర్యాప్తు సంస్థలను తెలంగాణపై ఉసిగొల్పుతున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 500 వ్యాపార కేంద్రాలపై ఐటీ, 100 ప్రాంతాల్లో సీబీఐ, 200 ప్రాంతాల్లో ఈడీ దాడులు అయ్యాయని చెప్పారు. ఎన్ఐఏ ఏకంగా 500-600 మందిని పిలిపించి బెదిరించి పంపిందన్నారు. బీఆర్ఎస్కు చెందిన 15-16 మంది ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ‘మోదీజీ మీరు ప్రజల దగ్గరికి వెళ్లండి. దేశాన్ని ఎలా అభివృద్ధి చేశారో, తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పండి. ప్రజల మనసులు గెలవండి. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవండి. అంతేగానీ.. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఈడీలను ప్రయోగిస్తాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తాం, అడ్డదారిలో అధికారంలోకి వస్తాం అంటే కుదరదు’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 రాష్ర్టాల్లో అడ్డదారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘తెలంగాణలోనూ ఇదే తరహాలో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి పప్పులు ఉడకలేదు. అందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగించి భయపెట్టయినా తెలంగాణను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. కానీ తాము భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. ఉద్యమం చేసి రాష్ట్రం సాధించి, ప్రజల ఆశీర్వాదంతో ప్రభత్వాన్ని నడుపుతున్నవాళ్లమని గుర్తు చేశారు. మోదీ, బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈడీ, సెబీ, ఎస్బీఐ, ఎల్ఐసీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పదే పదే పొడిగిస్తున్నదని కవిత గుర్తు చేశారు. ‘వాళ్లు ఎక్కడ డబ్బు పెట్టమంటే అక్కడ పెడతారు. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వెళ్లి పని పూర్తి చేసుకొస్తాయి. అందుకే వాళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తారు’ అని ఎద్దేవా చేశారు. అగ్నివీర్ పేరుతో యువతను సైన్యంలోకి తీసుకుంటున్నారని, శిక్షణ ఇచ్చి నాలుగేండ్ల తర్వాత రోడ్డుమీద పడేస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు ముందుకొచ్చినవారికి ఇచ్చే విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అగ్నివీరులను పర్మనెంట్ చేయాలని మోదీని డిమాండ్ చేశారు. ఆర్మీలో ప్రస్తుతం 3.5 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. గాంధీజీ తిరిగిన ఈ దేశంలో ఇప్పుడు అబద్ధం రాజ్యమేలుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ గురించి, అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ప్రధాని స్వయంగా పార్లమెంట్‌లోనే అబద్ధాలు చెప్తున్నారని వెల్లడించారు.
‘ధర్మమే గెలుస్తుంది’. ‘జైల్లో పెట్టినంత మాత్రాన కృష్ణుడికి నష్టం కలగలేదు. అజ్ఞాతవాసంలో ఉన్నంత మాత్రాన అర్జునుడి పరాక్రమం తగ్గలేదు. వనవాసం నుంచి తిరిగి వచ్చాక శ్రీరాముడు మరింత పరిపూర్ణత సాధించి ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు’. అంతా మా చేతుల్లోనే ఉన్నది, మేం ఎవరినైనా ఏమైనా చేయగలం, మేం దేవుడికన్నా బలవంతులమని విర్రవీగినప్పుడల్లా.. ప్రకృతి స్పందించి న్యాయం చేస్తుంది. రాబోయే రోజుల్లో అలాంటి న్యాయమే వస్తుంది. దేశంలో అరాచక పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోస్తుంది.
‘దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నదని చెప్పుకుంటున్నారు. అందులో ఒక ఇంజిన్ ప్రధాని అయితే.. మరో ఇంజిన్ అదానీ. ఈ విషయాన్ని దేశంలో చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు’ అని కవిత విమర్శించారు. ‘మాలాంటి వారిని టార్చర్ పెడితే ఏమొస్తుంది?. దీనికి బదులు ధరల తగ్గుదలపై దృష్టిపెట్టండి. మరిన్ని రాయితీలు కల్పించటంపై, మరిన్ని ఉద్యోగాలు కల్పించటంపై దృష్టిపెట్టండి’ అని హితవు పలికారు.
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే ఆరోపణలు అసంబద్ధమని కవిత పేర్కొన్నారు. ‘మేము బీ టీమ్ అయితే ఇక్కడి వరకు ఎందుకు వస్తాం?. బీజేపీ వాళ్లయితే ఎంత అవినీతి చేసినా ఏమీ కాదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు’ అని గుర్తు చేశారు. బీజేపీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ విఫలమైంది కాబట్టే ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకున్నదని చెప్పారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించామని, ఏప్రిల్‌లో మరో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించాలంటే వారి ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉంటుందని కవిత పేర్కొన్నారు. చట్టంలో ఇందుకు అవకాశం ఉన్నదని, అనేక కోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తనను 9వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ సూచించిందని, అయితే 10న ఢిల్లీలో ధర్నా ఉన్నది కాబట్టి.. 11న ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చి విచారణ జరపాలని కోరినట్టు తెలిపారు. అవసరమైతే మిగతా నిందితులను తీసుకొచ్చి, వారి సమక్షంలోనే విచారణ జరపాలని సూచించినట్టు చెప్పారు. అయితే అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించారని చెప్పారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు.