హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి రాష్ర్టానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని చెబుతూ రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి విద్యార్థి ఫెడరేషన్(టీజేఎస్ఎఫ్) ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఆదివారం ‘గణతంత్ర భారత్-జాగృత భారత్’ పేరిట భారత రాజ్యాంగంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు రాష్ర్టాల హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు. కిందిస్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలనే విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ర్టాల హక్కులను హరించే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ మాటలను విద్యార్థి నేతలు, మేధావులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
రాహుల్ జీ.. ఇదేనా మీ రాజ్యాంగ స్ఫూర్తి?
రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్‌గాంధీ పాకెట్ డైరీలా దాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. రాజ్యాంగ విలువలను ముందు తెలంగాణలో కాపాడాలని రాహుల్‌కు సూచించారు. కొద్దిరోజుల కిందట ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దఎత్తున మతకలహాలు జరిగి వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు? సీఎం, మంత్రులు ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే కనిపించడం లేదా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరగడమే కాకుండా తమ ముఖ్యమంత్రి, నేతలకు దాన్ని పాటించాలని హితబోధ చేయాలని రాహుల్‌గాంధీకి హితవు పలికారు.
హామీలు అమలయ్యేదాకా ప్రభుత్వాలపై పోరాటం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేసేదాకా ప్రభుత్వాలను నిలదీస్తామని తెగేసి చెప్పారు. విద్యార్థుల హక్కులను సాధించేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, హక్కులను కాపాడటం, పరిపాలనలో పారదర్శకత పాటించడం, రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు సమర్థంగా అమలు చేయడం వంటి 19 తీర్మానాలను సెమినార్లో ఆమోదించారు. తీర్మానాలతో పాటు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను తర్వలో విద్యార్థులు గవర్నర్‌కు అందించనున్నట్టు తెలిపారు.
రాజ్యాంగం వల్లనే సిద్ధించిన స్వరాష్ట్రం
దండలో దారంలాగా భారత రాజ్యాంగం మనందరినీ కలిపి ఉంచుతుందని కవిత అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పోరాటం చేశామని గుర్తుచేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ అయితే చాలనే నిబంధనను అంబేద్కర్ నాడు రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీలో కూడా బిల్ పాస్ కావాలనే నిబంధన ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.