ఖలీల్‌వాడి, అక్టోబర్ 20 : తెలంగాణతో కాంగ్రెస్‌కు ఉన్నది ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధమని నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని తెలిపారు. అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మంచి నాయకుడని, ఆయన విజయం ఖాయమని అన్నారు. అయితే భారీ మెజారిటీ కోసమే పని చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమె సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మాటలు చెప్పే వారిని ప్రజలు నమ్మరని.. పనులు చేసి చూపే వారినే నమ్ముతారని చెప్పారు.
బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి గురించి ప్రతి తలుపు, ప్రతి గుండెను తట్టాలని సూచించారు. హనుమంతుడి గుడిలేని ఊరులేదని.. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ అర్బన్ ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ కవిత ఉండటం నాయకులు, కార్యకర్తలకు కొండంత బలమని కొనియాడారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ రక్షణ కవచంలా ఉన్నారని తెలిపారు.