MLC Kavitha | సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిందని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టంపై సమీక్షించలేదని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరికలేదని అన్నారు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ప్రభుత్వ నాయకులు వారిని పలకరించిన పాపాన పోలేదని అన్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.20వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నం చేయడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని.. ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రైతు భరోసా సగం మందికి రానేలేదని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని.. 60 శాతం మందికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భక్త రామదాసు ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని విమర్శించారు. పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను కోల్పోయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని సూచించారు.