MLC Kavitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన చిర్రా సతీష్ కుటుంబం 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని. చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. అయితే, స్వయం ఉపాధి కోసం జిరాక్స్ మిషన్, లాప్‌ట్యాప్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతానని ఇటీవల కేసీఆర్ జన్మదినం రోజున ఎమ్మెల్సీ కవితకు సతీష్ మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన స్వయం ఉపాధి కావలసినవి సమకూర్చారు. జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించడమే కాకుండా ఆమెనే స్వయంగా ప్రారంభించబోతున్నారు.
మరోవైపు, సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత మహబూబాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రామానుజపురంలో జిరాక్స్ సెంటర్ ప్రారంభించిన అనంతరం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి నాయకురాలు మరిపెల్లి మాధవి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. కురవి వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. అన్నారంలో గాయకుడు మానుకోట ప్రసాద్ ఇంటిని సందర్శిస్తారు. అనంతరం కేసముద్రం మిర్చి యార్డ్‌ను సందర్శిస్తారు. దాంతో, మహబూబాబాద్ జిల్లా పర్యటనను ముగించుకొని భూపాలపల్లి జిల్లాకు వెళ్లి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాడ హరీష్ రెడ్డి వివాహానికి హాజరవుతారు.