MLC Kavitha | కొల్లాపూర్, ఫిబ్రవరి 28 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
సింగోటంలో లింగాకారంలో లక్ష్మీనరసింహస్వామి వారు ఉండడం అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా గమనిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారని మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేకమైన క్షేత్రం కోసం కేసీఆర్ రూ. 17 కోట్లు మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యం అన్నారు. ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి. దానివల్ల ప్రజలకు లాభం జరగాలి. కానీ ఏదో ప్రజల మీద కక్ష కట్టినట్లు దేవుడిపై కక్ష కట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి రూ. 17 కోట్లను క్యాన్సిల్ చేయించడం చాలా దారుణమన్నారు. తక్షణమే క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని తీసుకొని వచ్చి ఆలయ అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు కృషి చేయవలసిందిగా డిమాండ్ చేశారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే ఒక ఫేస్బుక్లో చిన్న పోస్టులు పెట్టిన లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించిన కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణమని కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేదని విమర్శించారు. జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా కొల్లాపూర్ నియోజక వర్గానికి అప్పుడప్పుడు వస్తూ టూరిస్ట్ మంత్రిగా వ్యవహారం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
నియోజకవర్గంలో పండే మామిడికాయలను దేశంలోని నలుమూలాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి జరుగుతుంటాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి మార్కెట్ మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి ఎక్కడ కూడా కనబడడం లేదు.. పదేపదే ప్రభుత్వం ఊదరగొడుతూ రైతుబంధు రుణమాఫీ అని చెప్పారు. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎక్కడ అమలు జరగలేదు. జనవరి 26 తేదీలోపు టకీటకీ మని రైతు భరోసా డబ్బులు పడతాయన్నారు. ఇప్పుడు మళ్లీ మార్చి 30 అని చెప్తున్నారు. కనీసం ఆ తేదీలోపైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలన్నారు. ప్రభుత్వము రైతులను, విద్యార్థులను ఆదుకుంటలేదన్నారు. ఇతర పార్టీ నాయకులపై కక్ష కట్టి వారిపై ఆగడాలకు పడుతున్నారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
నిన్న రాత్రి సాతపూర్ గ్రామంలో ఇవాళ మీటింగ్ కోసం ఫ్లెక్సీ కడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్త పరమేష్పై దారుణంగా 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలసి దాడి చేశారన్నారు. నీతి నిజాయితీగా పనిచేసి కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చామన్నారు. ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఏమొస్తుందన్నారు. ముఖ్యమంత్రి మీ మహబూబ్నగర్ జిల్లా గడ్డ మీద నుంచి చెప్తున్నాను. మేము కూడా పింకు బుక్ మెయింటెన్ చేస్తాము. కార్యకర్తలపై నాయకులపై దాడి చేసిన వారి చిట్టా రాస్తాం మా టైం వచ్చినప్పుడు చెప్తామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్, దూ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.