MLC Kavitha | ఖమ్మం: బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం నాడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, రీ సర్వే చేయడంతో మరో 1.5 లేదా 2 శాతం బీసీల జనాభా పెరుగుతుందని తెలిపారు. అంటే మొత్తం బీసీల జనాభా దాదాపు 48 శాతం ఉంటుందని అంచనా వేశారు. 48 శాతం బీసీలు ఉంటే… ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు ? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క అంశంపై అయినా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు రంగాలకు సంబంధించి వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లీంలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లీంలకు మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లీంల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లీంల పేరు చెప్పి ఆయా వర్గాల మధ్య పంచాయతీ పెట్టవద్దని సూచించారు.
గ్రామాల వారీగా ఏ కులంలో ఎంత జనాభా ఉందో ప్రభుత్వం బయటపెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇప్పటి వరకు ప్రభుత్వం బయపెట్టలేదని, దాన్ని కూడా వెంటనే బహీర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా లెక్కలు సరైనవా కావా అన్నది ప్రజలు తేల్చుకోగలుగుతారని తెలిపారు. సర్వే లో పాల్గొని వారికి మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, రీ సర్వేకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని , టోల్ ఫ్రీ నెంబరులో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు 51 శాతం అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తు చేశారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలిన జనాభా ప్రకారం నిధులు ఖర్చు చేసుకున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటే అభివృద్ధిలో భారత్ ఎప్పుడో అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తుందని, సామాజిక దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని చెప్పారు. జాగృతి పోరాటాల వల్లనే అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, బతుకమ్మ పండగకు రాష్ట్ర హోదా సాధ్యమయ్యిందని గుర్తు చేశారు.