హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): జనగణనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదించినా జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ దీనిని అమలు చేయడం లేదని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ కారణంగా ఇటీవల ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలు కాలేకపోయారని, ఇప్పటికైనా త్వరితగతిన జనగణన చేస్తే బీహార్, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో మరింత మంది మహిళలకు అవకాశాలు దక్కుతాయని స్పష్టంచేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన వేడుకలకు కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. ఈ సందర్భంగా స్వరవల్లరి తెలుగు గజల్ అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వనితా అంతరంగం-మహిళలకు గజల్ నీరాజనం’ అనే ఆడియో సీడీని కవవిత ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సంవర్భంగా కవిత మాట్లాడారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ హామీని అమలుచేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. అంగన్వాడీలు, ఆశావరర్లకు వెంటనే రాష్ట్రప్రభుత్వం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ది మహిళా కేంద్రీకృత పాలన
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే దిక్కుమాలిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళల, పురుషుల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారని, అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉన్నదని చెప్పారు. మహిళలు ద్వితీయశ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న అభిప్రాయం పోవాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ మహిళా నేతలు గండ్ర జ్యోతి, ముక్తవరం సుశీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అతివలకు ఆతిథ్యమివ్వడం అదృష్టం
సమాజంలో అసమానతలు ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా అతిథ్యమివ్వడం అదృష్టమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. అతివల విజయాలనే కాకుండావారి ధైర్యసాహసాలను గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం. మహిళలకు సమాన హకులు, గౌరవం, నిర్ణయాధికారం రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి వీరనారీమణులు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. మహిళలకు కులమతాలు లేవు. అంతా ఒకే కులం. మహిళలు ఐక్యంగా ఉండి హకులను సాధించుకోవాలి.
– కల్వకుంట్ల కవిత