MLC Kavitha | ఖైరతాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోవాల్నా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రేవంత్‌రెడ్డి సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ పాఠశాలను చూసినా ఏదో ఒక దుర్ఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యావ్యవస్థ ధ్వంసమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అస్వస్థతకు గురికాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మరణించిన 42 మంది పిల్లల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబసభ్యులను శనివారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు దవాఖానల పాలవుతున్న వరుస ఘటనలు బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. శైలజ పరిస్థితి విషమంగా ఉన్నదని, వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నది. సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటివరకు 42 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆహారం కలుషితమై మరణించారు. సగటున పది రోజులకు ఒకపసి ప్రాణాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటున్నది. అన్ని సంక్షేమ శాఖలు సీఎం వద్ద ఉండటం వల్ల పర్యవేక్షణకు, సమీక్షకు సమయం వెచ్చించలేకపోతున్నట్టు కనిపిస్తున్నది.
కనీసం పది నిమిషాల సమయం కేటాయించి సమీక్షిస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది అని సూచించారు. నారాయణపేట హాస్టల్లో కలుషిత ఆహారం తినడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత మరునాడే మరో ఘటన జరగడం దారుణమని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐఐటీ, ఐఐఎంకు వెళ్లాలా? ఎవరెస్టు శిఖరం అధిరోహించాలా? అనే ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు కలిగి ఉండేవారని ఆమె గుర్తుచేశారు. కవిత వెంట బీఆర్ఎస్ నేతలు రూప్సింగ్, శివశంకర్, రాజీవ్‌సాగర్, నవీనాచారి, ముఠా జయశంకర్, మారిపెల్లి మాధవి ఉన్నారు.