హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 4,000 మంది అంగన్వాడీ టీచర్లకు 10 నెలలుగా సగం జీతాలే అందుతున్నాయని, వారికి పూర్తిస్థాయి జీతాలు ఎప్పటినుంచి చెల్లిస్తారో చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మినీ అంగన్వాడీలను మేజర్ అంగన్వాడీలుగా ఏర్పాటుచేస్తూ 2023 అక్టోబర్‌లో అప్పటి సర్కారు జీవో జారీ చేసిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు చెల్లించే జీతాలను రూ.7,800 నుంచి రూ.13,600కు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక కేవలం 4 నెలలు మాత్రమే పూర్తిస్థాయి జీతం చెల్లించిందని, ఆ తర్వాత నుంచి 10 నెలలుగా వారికి అర్థజీతాలు చెల్లిస్తుందని చెప్పారు. క్వింటా మిర్చి పంటకు రూ.25 వేల చొప్పున మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ తాతా మధు ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్ఎంసీలో మాదిరిగా ఆస్తిపన్ను వడ్డీలో 90 శాతం ఇస్తున్న రాయితీ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. సింగరేణి సంస్థలో కార్మికుల జీతాలలో వ్యత్యాసాలను సవరించాలని ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు.
అకాడమీ పోస్టులను భర్తీచేయాలి:దేశపతి శ్రీనివాస్
రాష్ట్రంలో మూడు రకాల అకాడమీల కు చైర్మన్, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వా న్ని కోరారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలుగు అకాడమీకి ఖాళీపోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయా అకాడమీలకు బడ్జెట్ కేటాయింపులు కూడా లేవని తెలిపారు. ఉద్యమకారుడు దాశరథి శతజయంతి సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణ పథకాలకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని కోరారు. బ్రాహ్మణ విదేశీ విద్యకు, పరిషత్తుకు నిధులు కేటాయించాలని కోరారు.
తగ్గిపోతున్న మత్స్యసంపద ; బండా ప్రకాశ్
చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ విమర్శించారు. దీనివల్ల రాష్ట్రంలో మ త్స్య సంపద తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీని మెరుగుపర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యసంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.