Deshapathi Srinivas | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్న చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. అధిష్ఠానం మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలసవాద పుత్రుడు అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో దేవీప్రసాద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు జరుపుకుంటుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తోందని దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జై తెలంగాణ నినాదం మసకబారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలుగా హేళన చేశాడని అన్నారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి మన అస్తిత్వంపై చేస్తున్న దాడి అని దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భరతమాత ఓ ప్రేరణగా ఉంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రేరణ అని గుర్తు చేశారు. అనేక చర్చల తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడం జరిగిందని గుర్తు చేశారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామని దేశపతి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది కనుక సచివాలయానికి ఆయన పేరు పెట్టామని వివరించారు. నిత్యం అమరుల స్ఫూర్తిగా పాలన జరగాలనే ఉద్దేశంతోనే సచివాలయం ఎదురుగా అమరజ్యోతి భవనం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమే అని వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తుల విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమని స్పష్టం చేశారు..
అధిష్ఠానం మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరుకుంటుంటే, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా ప్రజలు తేల్చుకోవాలని తెలిపారు. కావాలంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు బయట ఎన్నైనా పెట్టుకోవచ్చని.. సచివాలయం ఎదుట మాత్రం పెట్టకూడదని స్పష్టం చేశారు.
తెలంగాణ బిడ్డ అప్పటి సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని దేశపతి శ్రీనివాస్ గుర్తు చేశారు. అంజయ్యకు జరిగిన అవమానం నుంచే ఒక పార్టీ పుట్టిందని అన్నారు. ఆ పార్టీలో నుంచి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి అని తెలిపారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? సోనియాకైనా తెలంగాణతో సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ముందు తెలంగాణ మేధావులతో ఏమైనా చర్చలు జరిపారా అని నిలదీశారు. కనీసం కోదండరాం, హరగోపాల్, అందెశ్రీల అభిప్రాయాలను తెలుసుకోండని హితవు పలికారు. . వారు ముగ్గురు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ వద్దని రేవంత్‌కు చెబితే మంచిదని అన్నారు. ఇప్పటికైనా రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సూచించారు.
రాజీవ్ విగ్రహం పెట్టాలని మొండికేస్తే తెలంగాణలో అలజడి మొదలవుతుందని.. మేము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం మానాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని చెప్పారు. మళ్లీ తెలంగాణ అస్తిత్వంపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే దాడిని కొనసాగిస్తోందని మండిపడ్డారు. గతంలో ఏపీ సచివాలయం ముందు తెలుగు తల్లి విగ్రహం ఉండేదని.. కనీసం ఆ స్ఫూర్తితోనైనా తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సూచించారు.