MLC Dasoju Sravan | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా ఉండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, ఎన్నికల కమిషన్, పోలీసులతో కుమ్మక్కై, ఓవైసీ బ్రదర్స్ కాళ్లావేళ్ల పడి బోగస్ ఓటింగ్‌తో గెలిచి జబ్బలు చరుచుకుంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్టుంది అని దాసోజు శ్రవణ్ విమర్శించారు. జీవన్మరణ సమస్య అని ఎందుకు అంటున్నామంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోయేది.. కాబట్టి అడ్డమైన దొడ్డిదారిలో గెలిచారు అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను అని శ్రవణ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తానేదో ఘనమైన విజయం సాధించినట్లు, తన మోసాన్ని తన దోపిడీని, తన పరిపాలన రాహిత్యాని సహించి కూడా ఆయనను గెలిపించినట్లు అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం. బీఆర్ఎస్ హయాంలో అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు.. మునుగోడు, దుబ్బాకలో డిపాజిట్లు రాకుండా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. జీహెచ్ఎంసీలో కేవలం రెండు కార్పొరేటర్లను గెలిచి, మిగతా వాటిలో డిపాజిట్లు కోల్పోయింది అని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు.
తానేదో సుద్దపూస అయినట్టు రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ పద్ధతిలో గెలిచినట్టు, ప్రజలు నచ్చిమెచ్చి ఓట్లు వేసినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతంటే ఏడ్వాలో, నవ్వాలో అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తలు, కానిస్టేబుల్స్ నుంచి డీజీపీ వరకు, ఎన్నికల సిబ్బందితో కుమ్మకై భర్త కోల్పోయిన మహిళ మీద అనేక దాష్టీకాలకు పాల్పడి రూ. 200 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టి.. అయినా విశ్వాసం లేకపోవడంతో ఎంఐఎంతో కాళ్లవేళ్లా పడి ఎమ్మెల్యేలు, కార్పొరేట్ల కుమ్మక్కై బోగస్ ఓట్లతో గెలిచి జబ్బలు చరుచుకుంటుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని శ్రవణ్ అన్నారు. పాతబస్తీ, బీహార్, రాయలసీమలో జరిగేటటువంటి రిగ్గింగ్, దొంగ ఓట్లు.. జూబ్లీహిల్స్‌కు తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా గెలిచినట్లు నటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.