Dasoju Sravan | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడిన ఉక్కుమనిషి, నిరాడంబర ప్రజానేత నాయిని నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శతకోటి వందనాలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మహా ప్రజా ఉద్యమంలో నాయిని పాత్ర అమోఘం, అపూర్వం, చిరస్మరణీయం. కార్మిక ఉద్యమ నాయకుడిగా, కార్మికులను, కూలీలను సంఘటితపర్చి, వారి హక్కుల కోసం రాజధాని నగరంలో అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించిన మానవతావాది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట వీర హనుమంతుడిలా నిలబడి రాష్ట్ర సాధన ఉద్యమానికి శక్తినిచ్చిన యోధుడు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి రాజీనామా చేసిన త్యాగశీలి నాయిని నర్సింహా రెడ్డి అని దాసోజు శ్రవణ్ కొనియాడారు.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC)లో భారత రాష్ట్ర సమితి తరఫున స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నాయినితో పాటు నన్ను కూడా స్వయంగా కేసీఆర్ నియమించారు. అందుచేత కేసీఆర్ దీక్ష మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం విజయ దిశగా సాగిన ప్రతి ఘట్టంలోనూ వారితో సన్నిహితంగా కలిసి పని చేసే అరుదైన అవకాశం నాకు లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయిని, పోలీసు వ్యవస్థను ప్రజల పక్షాన నిలబెట్టేలా పలు కీలక సంస్కరణలకు అమలు చేసేందుకు తోడ్పడ్డారు. ఆయన సేవలు, త్యాగం, సమర్పణ భావం తెలంగాణ తరతరాలకు స్పూర్తిగా నిలిచాయి.. నిలుస్తూనే ఉంటాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
పదవుల కోసం కాదు.. ప్రజల కోసం.. తెలంగాణ విముక్తి కోసం.. అన్న మహత్తరమైన విలువలతో, నిరాడంబరంగా, నిస్వార్ధంతో, సర్వస్వ సమర్పణతో సాగిన నాయిని జీవితం బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, ప్రతి ప్రజాప్రతినిధికి స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మనం వారికీ ఘన నివాళులర్పిస్తూ వారి ఆశయాలు మనకు అస్త్రం కావాలి, వారు చూపిన మార్గం మనకు దిక్సూచి కావాలి అనే సంకల్పంతో ముందుకు సాగుదాం. జోహార్ నాయిని నర్సింహారెడ్డి అని దాసోజు శ్రవణ్ నినదించారు.