ఖైరతాబాద్, ఆగస్టు 4: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు నిర్వీర్యమవుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘గురుకుల విద్యాలయాలు.. సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ ‘గురుకులాల విషయంలో దున్నపోతుపై వాన పడ్డట్టు ప్రభుత్వం వ్యహరిస్తున్నది. కేసీఆర్ హయాంలో స్థాపించిన వెయ్యికి పైగా గురుకులాల విద్యార్థులు నేడు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికయ్యారు. కొందరు విదేశాల్లో చదువుకుంటున్నారు.
ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి దేశానికే పేరు తెచ్చారు. భావిభారత పౌరుల బంగారు భవిత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు నేడు అస్తవ్యస్తంగా మారాయి. విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే కండ్లలో నీళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 100 మంది పిల్లలు చనిపోయారు. దాదాపు 900 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. పాము కాటు, ఎలుకల దాడి, విద్యుత్ షాక్ లాంటి ఘటనలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. గురుకులాల్లో 25 శాతం సీట్లు భర్తీ కాలేదని, సుమారు లక్ష సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇది రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైసింగ్ తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి.. ముందుగా గురుకులాలను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. గతంలో విద్యకు 14 శాతం వార్షిక బడ్జెట్ కేటాయిస్తే.. ప్రస్తుతం 7, 8 శాతానికి కుదించారని విమర్శించారు. డ్రాపౌట్ రేషియో పెరిగిపోయిందని, పర్యవేక్షణ కొరవడిందని తెలిపారు. గురుకులాలను నడపని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ నిర్మిసామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో సీఎం నిమగ్నమయ్యారని విమర్శించారు. సమావేశంలో తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ గోసుల శ్రీనివా స్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సామాజికవేత్త వీవీ రావు, ప్రొఫెసర్ యాదగిరి, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల స్వామి తదితరులు పాల్గొన్నారు.