హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సినీపరిశ్రమపై కాంగ్రెస్ సర్కార్ జులుం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు కాంగ్రెస్ పెద్దలు ఫిల్మ్ ఇండస్ట్రీపై అజామాయిషీ చెలాయిస్తూ విచ్చలవిడిగా కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కంచే చేను మేసినట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫీ యాక్ట్-1955 ప్రకారం సినిమా ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలో ఉంటాయని గుర్తుచేశారు. సినిమాటోగ్రఫీ శాఖను పక్కనబెట్టి హోంశాఖ నుంచే సినిమా టికెట్ ధరల పెంపు జీవో లు రావడం అసంబద్ధమని అన్నా రు. సినిమాల జీవోలన్నీ సీఎంవో ఒత్తిడితోనే వస్తున్నాయని ఆరోపించారు. తనకు తెలియకుండానే టికెట్ ధరల పెంచుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ప్రశ్నించినవారిపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కమీషన్లు దక్కడంతోనే ధరల పెంపు
ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ను ప్రభాస్ పెద్దమ్మ ఆత్మీయంగా పలుకరించిన నేపథ్యంలోనే ‘ది రాజాసాబ్’ సినిమాపై వివాదాలు సృష్టించి, టికెట్ రేట్ల పెంపు జీవోపై హైకోర్టు ద్వారా స్టే తెప్పించారని దాసోజు ఆరోపించారు. ఒక్కో హీరో సినిమాకు ఒక్కో న్యాయం ఎందుకు? అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్‌రెడ్డి.. కమీషన్ల అందినందుకే ధరలు పెంచుతున్నారా అని నిలదీశారు. సంబంధితశాఖ మంత్రిని పక్కనబెట్టి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోమటిరెడ్డికి ఏ మాత్రం ఆత్మగౌరం ఉన్నా.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.