హైదరాబాద్, మే 10 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి..నిస్సిగ్గుగా గుజరాత్ మాడల్‌ను కీర్తించడం రాజకీయ వంచనేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిప్డడారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ వ్యవహరించిన తీరుపై ఆయన ఎక్స్ వేదికగా ఎండగట్టారు. దేశానికే స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మాడల్‌ను వదిలిపెట్టి గుజరాత్ విధానాలను పొగడటం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసింది హస్తం గుర్తుకా? లేదని కమలం కోసమా అని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదని, బడే భాయ్ ముసుగులో బీజేపీ అనుకూల పాలనా? అని మండిపడ్డారు.
గుజరాత్ మాడల్ అంటనే కార్పొరేట్ శక్తుల దోపిడీ అని కాంగ్రెస్ అగ్రనేత దేశవ్యాప్తంగా పోరాడుతుంటే, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి తన ట్రిలియన్ ఎకానమీ కల సాకారానికి గుజరాత్ మాడల్‌ను బెంచ్‌మార్క్‌గా తీసుకోవడం రాహుల్‌కు వెన్నుపోటు పొడవడమేనని స్పష్టంచేశారు. రాహుల్ పీడకల అని పిలిచే నమూనాను రేవంత్ తన స్వప్నం అని ఎలా అంటారని ప్రశ్నించారు. ‘గుజరాత్ మాడల్‌ను కాంగ్రెస్ అధిష్టానం పేదల వ్యతిరేకిగా పరిగణిస్తుంటే, సీఎం మాత్రం దానిని అద్భుత విజన్ అని కొనియాడుతున్నారు..ఇది కేవలం అభిప్రాయ బేధం కాదు..కాంగ్రెస్ సిద్ధాంతాలను తుంగలో తొక్కి సాగిస్తున్న రాజకీయ కుట్రలా కనిపిస్తున్నది ’ అని విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీపై రేవంత్ చూపుతున్న బడే భాయ్ భక్తి ఇప్పుడు పరాకాష్టకు చేరిందని అభివర్ణించారు. ఆయన వ్యవహారశైలి ఏఐసీసీ జాతీయ వ్యూహానికి పూర్తి విరుద్ధమని స్పష్టంచేశారు. గిఫ్ట్ సిటీలు, ఇండస్ట్రీయల్ కారిడార్ల పేరిట కమలం ఎజెండాను అమలు చేస్తున్నారని తూర్పారబట్టారు. కేంద్రంతో తెలంగాణకు ఒనగూరిన లాభాల పై రుజువులు చూపాలని సవాల్ విసిరారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి వచ్చిన నిధులపై తక్షణమే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డి మాండ్ చేశారు. తెలంగాణలో రాహుల్‌గాం ధీ అభివృద్ధి నమూనాను విస్మరించి మోడీ గుజరాత్ మాడల్ అమలుకు రేవంత్‌రెడ్డికి ప్రత్యేక హక్కులేమైనా ఇచ్చారా? అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే నాలుగుకోట్ల ప్రజలు ఊరుకోరని తేల్చిచెప్పారు.