Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల కాలంలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతికి అర్రులు చాస్తూ రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసిండు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ.. రేవంత్ రెండేండ్ల పాలనలో అధోగతి పాలైందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారు. సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారు. జీఎస్టీ వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యింది. అంటే 32 శాతం మేరకే స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతం లోపే వచ్చింది. అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయి. రెండేళ్లలో రూ. 3.48 వేల కోట్ల అప్పు చేశారు. ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారు. ఇన్ని కోట్ల అప్పు తెచ్చి పీకింది ఏమీ లేదు. అప్పులు భారీగా తెచ్చి రేవంత్ ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగ్ డాటా రేవంత్ బట్టలు విప్పేసింది. అనుభవం లేని సీఎం ఉంటే ఇంతకంటే ఏం జరుగుతుంది. హైడ్రా పేరిట ఆర్ఆర్ టాక్స్ పేరిట దోపిడీ చేశారు అని దాసోజు శ్రవణ్ తెలిపారు.
లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి ఓ బులెటిన్ విడుదల అయింది. సందర్శకులకు, మీడియాపై ఆ బులెటిన్ ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశాన్ని నిషేధించారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి పార్టీల సభాపక్ష కార్యాయాల వరకే అనుమతి ఉంటుందని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో వాదిస్తున్న అడ్వకేట్లను సెల్ ఫోన్లు తీసుకు రావద్దని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ బులెటిన్ రాజ్యాంగ విరుద్ధం. ఏం గూడుపుఠాణీ నడపాలని ఈ బులెటిన్ ద్వారా నిషేధాజ్ఞలు విధించారు..? సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ వాదనలు జరిగినపుడు కూడా సెల్ ఫోన్లు అనుమతిస్తారు. ఇది స్పీకర్ సొంత వ్యవహారం కాదు ,రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉంది వ్యవహారం. తక్షణమే బులెటిన్ ఎత్తి వేయాలని స్పీకర్‌కు లేఖ రాశాను. ఈ విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశమివ్వాలి. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగింది. ఓల్డ్ సిటీలో బోగస్ ఓటింగ్ గురించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తుంటే విన్నాం.. కానీ జూబ్లీహిల్స్‌లో మేము ప్రత్యక్షంగా చూశాం. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించారు. ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.