MLC Dasoju Sravan | హైదరాబాద్, ఆగస్టు 1: రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో, రేషన్ కార్డులు అందుకోబోతున్న అమ్మలకి, అక్కలకి, చెల్లెల్లకి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గానికి కేటాయించిన 1959 రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభినందనలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా మూడుచోట్ల స్పష్టత అవసరమని, వెంటనే సవరణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఖైరతాబాద్ సర్కిల్లో 22,399 దరఖాస్తులు అందినప్పటికీ, కేవలం 1959 కార్డులు మాత్రమే మంజూరు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అదే సమయంలో బహదూర్‌పురా, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో 5000కు పైగా కార్డులు ఇవ్వబడినట్టుగా ఉందని తెలిపారు. ఈ వ్యత్యాసానికి కారణాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
కమిషనర్ “ప్రజాపాలన” కార్యక్రమంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మొత్తం వచ్చిన దరఖాస్తులు ఎన్ని? ప్రజాపాలన ద్వారా కొత్తగా వచ్చినవి ఎన్ని? అన్న వివరాలను అధికారికంగా విడుదల చేయాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు.
“గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు” అనే వ్యాఖ్య పూర్తిగా వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2016 నుండి 2023 మధ్యకాలంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అలాగే 2014లో 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అన్నారు. గతంలో ఏమీ ఇవ్వలేదని చెబితే ప్రజల్లో తప్పుదారి పట్టించే అభిప్రాయాలు ఏర్పడతాయని హెచ్చరించారు. “రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతి అర్హుడికి కార్డు మంజూరు చేయాలి. ఇది సామాజిక న్యాయం. ఇది సంక్షేమ పాలనకు మూలాధారం. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది” అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఆగస్టు 1:
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో, రేషన్ కార్డులు అందుకోబోతున్న అమ్మలకి, అక్కలకి, చెల్లెల్లకి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు… pic.twitter.com/LxX2IJsgNK— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 1, 2025