హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మెట్రో ఆస్తులను తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పైగా రూ.30వేల విలువైన ఆస్తులను రూ.15వేల కోట్లకు తెచ్చానని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో విషయంలో కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. క్యూర్, ప్యూర్, రేర్పై ఊదరగొడుతున్న ఆయనకు వాటిపై అవగాహన లేదని.. తాము చెప్పింది అబద్ధమైతే దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.
మెట్రో ఫేస్-1ను పూర్తిచేసింది కేసీఆరే..
కాంగ్రెస్ సీఎంలు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థత వల్లే మెట్రో రైలు ఆలస్యమైందని కానీ మూర్ఖుడైన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు అంటగట్టడం దుర్మార్గమని దాసోజు ధ్వజమెత్తారు. చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ మెట్రో మొదటి దశను పూర్తిచేసిన పాలనాదక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. చారిత్రక కట్టడాలు, మసీదులు, ఆలయాలు, చర్చ్‌లపై గౌరవం లేని రేవంత్‌రెడ్డి వాటిని కూలగొడుతున్నారని విరుచుకుపడ్డారు. ‘ఒకవేళ మెట్రో ఆస్తులు రూ.30వేల కోట్లయితే రూ.15వేల కోట్లకు ఎందుకు విక్రయించింది.? రేవంత్‌రెడ్డి ఏమైనా ఎల్అండ్ టీ కంపెనీకి అల్లుడా? ఎల్అండ్టీకి చెందిన రూ.13వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం ఎందుకు చేశావ్?’అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎల్అండ్టీకి చెందిన 50, 60 స్టేషన్లు, సబ్స్టేషన్లు, నాలుగైదు అల్ట్రామోడల్ మాల్స్, లక్షల స్క్వేర్ ఫీట్లు కలిగిన స్థలాలను కబ్జా చేసి బినామీలకు కట్టబెట్టేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణకు సిద్ధమా అని నిలదీశారు. ‘మెట్రో ప్రాజెక్టు కొనుగోలు వ్యవహారంలో ఎన్నికోట్లు చేతులు మారాయో ప్రజలు తెలియాలి.. తప్పు చేయలేదని భావిస్తే వెంటనే నీపై సిట్ వేసుకొని విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలి’ అని డిమాండ్ చేశారు. అధికారం లోకి రాగానే మెట్రో రైలు సీఎఫ్‌వోను జైలుకు పంపుతానని బెదిరించి, రెండున్నరేండ్ల తర్వాత బలవంతంగా గుంజుకున్నారని ఆరోపించారు.
హైటెక్‌సిటీ-శంషాబాద్ మెట్రో రద్దు ఎందుకు?
రూ.6,200 కోట్లతో టెండర్లు పిలిచిన హైటెక్‌సిటీ-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు-2ను ఎందుకు రద్దు చేశారని దాసోజు ప్రశ్నించారు. కేవలం కేసీఆర్, కేటీఆర్‌పై కోపంతో రద్దుచేసింది నిజం కాదా? అని నిలదీశారు. రేవంత్ దుశ్చర్యలతో పెట్టుబడిదారులు హైదరాబాద్ రావడానికే భయపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే 71 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి మెట్రో-2పై ఎందుకు నిలదీయలేదు.. కాంగ్రెస్‌కు చెందిన 12మంది ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు లెవనెత్తలేదు? కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేయలేదెందుకు? అని ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘తమ్మిడిహెట్టి ప్రాజెక్టు అనుమతి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడంటున్నవు.. మెట్రో-2కు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నడని అంటున్నవు.. ఇంతటి నిస్సహాయస్థితిలో సీఎంగా ఎందుకు కొనసాగుతున్నవు.. నీ చేతగానితనమా.. అనుభవ రాహిత్యమా’ అని ఎద్దేవా చేశారు. చేతగాని స్థితిలో కిషన్‌రెడ్డి-కేటీఆర్ బంధమంటూ ఆరోపణలకు దిగడం, మెట్రోను ఆలస్యం చేశారని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. మోదీని ప్రసన్నం చేసుకొని ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకొనేందుకు రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారని విమర్శించారు.