ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపైనా పట్టింపులేదని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణభవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆయన మాట్లాడారు.
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఆదరించాలని, ప్రశంసించేవారిని తిరస్కరించాలని కోరారు. తనది ప్రశ్నించే గొంతుక అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగభృతి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వంటి వాటిపై ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురబోతోందని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించాలని.. హకుల కోసం పోరాడే రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.