BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది.
ముందుగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పనుల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకుని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు అసలు బడ్జెట్ ఎంత? దానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మూసీ ప్రక్షాళనను హరీశ్‌రావు వ్యతిరేకించలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకెళ్తారని అడిగారని వివరించారు. మా సభ్యులు ముఖ్యమంత్రిని కించపరిచినట్లు మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు ఇంత సమయం వద్దని.. స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కోరామని తెలిపారు. దీనికే ముఖ్యమంత్రికి అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తగినంత సమయం ఇవ్వలేదు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.