హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. శాసనసభలో ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన హరీశ్‌రావును పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొని ఇంకా ఎం తకాలం వాళ్లు పార్టీ మారలేదని బుకాయిస్తారని నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు.
2014లో రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి సూచించిన గీతారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డిను కేసీఆర్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్లుగా నియమించిందని, ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నాటి విపక్షనేత చంద్రబాబు సూచించిన యనమల రామకృష్ణుడు, నాగం జనార్దన్‌రెడ్డిని చైర్మన్లుగా నియమించిందని వేముల గుర్తుచేశారు. ఈ క్రమం లో రాష్ట్రంలో ప్రతిపక్షనేత కేసీఆర్ సూచించిన హరీశ్‌రావును కాదని అరికెపూడి గాం ధీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడిని బీఆర్ఎస్ సభ్యుడే అంటూ బుకాయిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు తీరుపై వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరికెపూడితో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ హాజరైన విషయాన్ని, ఏఐసీసీ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.
కాంగ్రెస్ వచ్చాక అన్ని వర్గాలను, అన్ని ప్రజాస్వామిక సంప్రదాయాలను బుల్డోజ్ చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతీ రాథోడ్ విమర్శించారు. ఇకనైనా ధ్వంద్వ వైఖరి వీడి సీఎం రేవంత్‌రెడ్డికి దమ్మూ, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కాంగ్రెస్ గుర్తుతో గెలిపించి పదవులు ఇప్పించుకోవాలని సవాల్ చేశారు.
అసెంబ్లీలోని కమిటీహాల్లో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించిందని నిరసన తెలిపింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రతిపాదించిన హరీశ్‌రావును కాదని, అరికెపూడిని నియమించటాన్ని ఆక్షేపిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.