Kaleshwaram Project | కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నా ప్రాణం పోయినా సరే రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కలిగించినా, అవరోధాలెన్ని సృష్టించినా హరిత తెలంగాణను సాధించే వరకు మా ప్రస్థా నం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే అది భ్రమే. నాకు ఎల్లప్పుడు అండగా ఉంటూ దీవిస్తున్న నా ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరుతా. తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్ లైన్.. నిధులు, నియామకాలు, నీళ్లు. స్వరాష్ట్రంలో నిధులు, నియామకా లు సాధించాం. ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే’.. 2016 మార్చి 31న శాసనసభా వేదికగా చేసిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలివి. చెప్పింది చెప్పినట్టు కార్యరూపంలో పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

రాష్ట్రంలో గోదావరి పరీవాహకం 69 శాతం, కృష్ణా 68.5 శాతం ఉన్నది. మెజార్టీ పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో గోదావరి, కృష్ణా నదుల్లోని నికర, మిగులు జలాలను సమర్థంగా వినియోగించుకొని, కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. అందుకోసమే నూతన జల విధానం (రీడిజైనింగ్)కు శ్రీకారం చుట్టింది. ఈ స్వప్నంలో మొదటి భాగం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జిల్లాలో ఉమ్మడి రాష్ర్టానికి 75 శాతం విశ్వసనీయత కలిగిన నికర జలాల కేటాయింపులు 1,489 టీఎంసీలు ఉంటాయని లెక్క గట్టి.. అందులో 954 టీఎంసీలను తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది.
ఉమ్మడి రాష్ర్టానికి ఈ కేటాయింపులు చేసినప్పటికీ. ప్రాజెక్టులు పూర్తికాక పోవడంతో అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవ వినియోగం ఏనాడు 400 టీఎంసీలకు మించి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలను అధ్యయనం చేసి.. గోదావరి జలాల గరిష్ఠ వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుందని భావించి.. రూపకల్పన చేసింది. దీని ద్వారా వట్టిపోయిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, ఎగువమానేరు, దిగువమానేరు, మధ్యమానేరు తదితర జలాశయాలు జీవం పోసుకుంటాయని భావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 1.80 కోట్ల ప్రజానీకానికి తాగునీరుతోపాటు పరిశ్రమల స్థాపనకు నీరు ఉపయోగపడుతుందని నిర్ణయించింది. ఎల్లంపల్లి-తూపాకుల గూడెం బరాజ్ మధ్య దాదాపు 170 కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం వృద్ధి చెందుతుందని విశ్వసించి, ఆచరణ సాధ్యం కాదని భావించి కాళేశ్వరాన్ని తొలితెలంగాణ ముఖ్యమంత్రి సుసాధ్యం చేసి చూపించారు.
సమైక్య ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో కుట్ర దాగి ఉన్నదని ఉద్యమ నేతగా ఉన్న సమయం నుంచి వాదిస్తూ వచ్చిన కేసీఆర్.. స్వరాష్ట్రం వచ్చాక అందులోని లోటుపాట్లపై ఆరా తీశారు. లోపాలను బహిర్గతం చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న కుట్రను అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టినట్టుగా చూపించారు. గణాంకాలతో సహా వివరించారు. మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏండ్ల నీటి లెక్కల ఆధారంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలను శాసనసభ ముందు పెట్టిన విషయం తెలిసిందే. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నదని చెప్పడంతోపాటు ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉన్నదని తన ప్రసంగంలోనే అసెంబ్లీలో వివరించారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరి 2,430 టీఎంసీల లభ్యత ఉన్నదన్న విషయాన్ని వెల్లడించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే అవకాశం ఉన్నా రేవంత్ సర్కార్ వివక్ష చూపుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) వద్ద 7,71,580 క్యూసెక్కులు అంటే దాదాపు 70 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. నిజానికి ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 390 టీఎంసీల నీరు సముద్రం పాలు కాగా, శుక్రవారం ఉదయం వరకు 440 టీఎంసీల వరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన వందల టీఎంసీలు సముద్రం పాలవుతుంటే.. ఎగువన ఉన్న ప్రాజెక్టులు మాత్రం వెలవెలబోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.263 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 17,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పక్కన పెడితే మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.82 టీఎంసీల నీరు ఉన్నది. ఇన్‌ఫ్లో అంతంత మాత్రమే.

లోయర్ మానేరు డ్యాం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5,296 టీఎంసీల నీరు ఉన్నది. అప్పర్ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.45 టీఎంసీలు, అన్నపూర్ణ జలాశయ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, 0.75 టీఎంసీలు, నందిమేడారం జలాశయ సామర్థ్యం 0.135 టీఎంసీలు కాగా 0.747 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రాజెక్టుల పరిస్థితి ఇలావుంటే.. రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో ప్రకారం నీటిని పైప్రాజెక్టులకు ఎత్తిపోయవచ్చు. ఎల్లంపల్లి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 23,072 క్యూసెక్కులుగా వస్తున్నది. కడెం ప్రాజెక్టు నిండింది.
ఇన్‌ఫ్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఇన్‌ఫ్లో తగ్గినా కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి నీరు తీసుకోవడానికి వీలున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీ పంపుహౌస్‌కు పంపించి.. అక్కడి నుంచి మధ్యమానేరు, అలాగే లోయర్‌మానేరు డ్యాంలకు నీరు ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలను బట్టి చూస్తే.. మూడు టీఎంసీలకు వరకు ఎత్తిపోసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నందిమేడారం జలాశయం వద్ద మూడు పంపులు ఆన్‌చేసి ఈ నీటిని పైకి ఎత్తిపోయవచ్చు.కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఏఎస్) పరిధిలోకి వెళ్లిపోయాయి. వాళ్లు నీటిని స్టోరేజ్ చేయవద్దని సూచించారు. నిజానికి చిన్న లోపాలను పెద్దగా చూపి.. దాదాపు ఏడు నెలలపాటు కాంగ్రెస్ ప్రభుత్వం సమయాన్ని వృథాచేసింది.

సీజన్ ప్రారంభంలో సర్వేలు చేయడం వల్ల ప్రస్తుతం నీరు తీసుకునే సౌలభ్యం లేకుండాపోయింది. అంతేకాదు, ఇక్కడి ఇంజినీర్లు బ్రహ్మాండగా పనిచేస్తున్నారని నేషనల్, ఇంటర్నేషనల్ ఇంజినీర్లు ప్రశంసిస్తుంటే.. ఇక్కడి ప్రభుత్వం వారిని పక్కన పెట్టి.. ఏజెన్సీలు ఇతర పేర్లతో ప్రాజెక్టుల స్వల్ప రిపేర్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో నీటిని ఎత్తిపోసుకునేందుకు ఒకే ఒక ఆధారం ఎల్లంపల్లి ప్రాజెక్టు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఎత్తిపోసుకుంటే ఎగువ ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశమున్నది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఒంటెత్తు పోకడలకు పోతే.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించనున్నది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నిలువెల్లా కరువును ఎదుర్కొని వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా ఆనాటి పాలకులు స్పందించలేదు. సాగునీరు ఇచ్చి అన్నదాతలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదు. నిజానికి 1970-71 నుంచి 2014 వరకు అంటే 44 ఏళ్ల లెక్కలను తీ సుకుంటే.. ఏటా 1,709 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలైన ఆనాటి పాలకులు ప్రాజెక్టులు కట్టాలన్న ఆలోచన చేయలేదు. స్వరాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రమవుతున్న సమయంలో కంటితుడుపు చర్యగా సమైక్య ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని 2008లో తెరపైకి తెచ్చి ప్రారంభించింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల పూర్తిస్థాయి మట్టంతో బరాజ్ నిర్మించి 160 టీఎంసీల ప్రాణిహిత నీటిని ఎల్లంపల్లికి తరలించి అ క్కడి నుంచి మిడ్‌మానేరు ద్వారా చేవెళ్లకు చేర్చాలని అప్పటి సర్కారు కేంద్రానికి ప్రతిపాదించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టినట్టు చెప్పింది. నాటి ఏపీ ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను కేంద్ర జల సంఘంలో ని హైడ్రాలజీ డైరెక్టరేట్ వారు పరిశీలించి.. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై పలు అనుమానాలను లెవనెత్తుతూ.. 2015 మార్చి 4న స్పష్టమైన లేఖ రాశారు. విచిత్రం ఏమిటంటే తమ్మిడిహెట్టికి సంబంధించిన ఎటువంటి ఆమోదం రాకముందే.. నాటి ప్ర భుత్వం 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ పనులు తప్ప అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభించింది. అప్పటి ప్రభుత్వం 2014 జూన్ వరకు ఈ ప్రాజెక్టులపై దాదాపు 7 వేల కోట్లు ఖర్చు చేసింది. అంతేకాదు.. బరాజ్‌కు అనుమతి రాకుండా ప్యాకేజీ పనులు చేపట్టి అపఖ్యాతిని మూటకట్టుకున్నది.
