సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ సోమవారం అసెంభ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శాసనసభ్యులు
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, అనిల్ జాదవ్‌తో కూడిన బీఆర్ఎస్ బృందం సోమవారం స్పీకర్‌ను కలువడానికి అసెంబ్లీకి వెళ్లింది. ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయానికి బృందం చేరుకుంది. అయితే కార్యాలయం మూసి ఉండటంతో ఎమ్మెల్యేలందరూ అక్కడే కొద్దిసేపు ఉన్నారు. అయినా స్పీకర్ రాకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అక్కడే మెరుపు ధర్నాకు దిగారు. ‘సుప్రీంకోర్టు తీర్పును పాటించండి.. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటేయండి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. స్పీకర్ సోమవారం ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. కానీ సమయం దాటినా స్పీకర్ కార్యాలయానికి రాలేదని, ఆఫీసు కూడా మూసిఉండడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపామని వెల్లడించారు. సమయమిచ్చిన సభాపతి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మూడు నెలల్లోగా అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతున్నట్టు పేర్కొన్నారు.