హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజ య్, కౌశిక్‌రెడ్డి తదితరులు సోమవారం స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకుసంబంధించిన అఫిడవిట్లను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో శాసనసభ కార్యదర్శికి అందజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్‌కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డికి సంబంధించి స్పీకర్ కార్యాలయం సూచించిన మేరకు అఫిడవిట్ల రూపంలో సమాధానాలను పొందుపరిచి ఇచ్చారు. ఫిరాయించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌కు సంబంధించి స్పీకర్‌కు సమర్పించిన సమాధానాలపై రిజాయిండర్లను కూడా అందజేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఇంకా స్పీకర్ నోటీసులు ఇచ్చారా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
స్పీకర్ విచారణ చేపట్టాలి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేపట్టాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను స్పీకర్ చేపడ్తారని జగదీశ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీ-ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారని, వాళ్లు ముమ్మాటికీ పదవులను కోల్పోక తప్పదని తెలిపారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై అనేక సాక్ష్యాధారాలను అఫిడవిట్ల రూపంలో స్పీకర్‌కు అందజేశామని చెప్పారు. స్పీకర్ వీలైనంత త్వరగా ఈ అంశంపై ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమించాల్సి ఉంటుందని అన్నారు. ప్రత్యక్ష విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్రోహాన్ని పూర్తి ఆధారాలతో బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ నిష్పక్షపాతంతో వ్యవహరిస్తారనే ఆశిస్తున్నామని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బుకాయింపులు, అబద్ధాలాడుతున్నారని ఆరోపించారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకంగా తాను ఏ పార్టీలో ఉన్నానో తనకు తెలియదని, స్పీకర్ చెప్తాడని అంటున్నాడని పేర్కొన్నారు. మనం మాట్లాడేది ప్రజలు వింటున్నారన్న సోయి కూడా ఆయన మరిచిపోయినట్టున్నారని విమర్శించారు. అసంబద్ధమైన వాదనలు చేస్తే ప్రజలు ఈసడించుకుంటున్నారని, మంత్రులుగా, అంతకన్నా ఉన్నతమైన పదవులు అనుభవించినవాళ్లు కూడా నిస్సిగుగ్గా, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, వారి మాటలను చూస్తుంటేనే ఎంతటి నైరాశ్యంలో ఉన్నారో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలో ఎప్పుడో పతనమయ్యారని చెప్పారు. ప్రజలకు, స్పీకర్‌కు, న్యాయస్థానాల కండ్లకు గంతలు కడ్తామనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఫిరాయించిన పది స్థానాల్లో మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు మట్టికరవక తప్పదని తెలిపారు. తప్పుచేసిన వారిని శిక్షించాలన్న కోరిక ప్రజల్లో ఎక్కువగానే ఉన్నదని అన్నారు.
నీటి పంపకాల్లో అన్యాయం చేసిందే కాంగ్రెస్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుర్రలేదని అంటుంటారని, అది నిజమే అనిపిస్తున్నదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జగదీశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు నీటివాటాల విషయంలో అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్ర విభజన చట్టాన్ని చదువుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హితవు చెప్పారు. కృష్ణా నీటిలో ఆంధ్రకు 511, తెలంగాణకు 299 కేటాయించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు కేంద్రం లో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నదని గుర్తుచేశారు. రాష్ర్టానికి వచ్చిన వాటా నీళ్లను కూడా సరిగ్గా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతున్నదని విమర్శించారు. ఈ విషయాన్ని కేఆర్ఎంబీనే చెప్పిందని అన్నారు.
ఫిరాయింపులు మొదలయ్యిందే కాంగ్రెస్ నుంచి
దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీల నుంచి ఫిరాయించేలా ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆనాడు జనతాపార్టీ మొదలు ఇప్పటి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వరకు పాపం మొత్తం కాంగ్రెస్‌దేనని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ కూడా తక్కువేమీ తినలేదని, సాయంత్రం వరకు ఒక పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తెల్లారేసరికి చేర్చుకున్నదని విమర్శించారు. దేశ రాజకీయాలను భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతోనే ఫిరాయింపు చట్టం సరిగ్గా అమలుకావడంలేదని ఆరోపించారు.
చెప్పు దెబ్బలకు సిద్ధమా?
నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలను నిరూపించేందుకు తాము సిద్ధమని, ఒకవేళ నిజం నిరూపితమైతే చెప్పుదెబ్బలకు సిద్ధంగా ఉంటారా అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటును తొలి నుంచి అడ్డుకున్నదే కాంగ్రెస్ అని, 1969 అయినా, 2009 లో ఇచ్చిన తెలంగాణను వెనక్కు తీసుకోవడంలో అయినా.. ఇక్కడ జరిగిన యువత బలిదానాలకైనా కాంగ్రెస్సే కారణమని, దీనిపై ఎక్కడైనా చ ర్చకు సిద్ధమని చెప్పారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్ర భుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బనకచర్లపై కూడా బీఆర్ఎస్ మాట్లాడేవరకు ఎందుకు ఉలుకూపలుకూ లేకుండా ఉన్నదని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను ఏనాడైనా కాపాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే అని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.