హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సాగించిన పోరాటాల ఫలితంగానే మెట్రో రైలు ప్రాజెక్టును జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు విస్తరించేందుకు ప్రభ త్వం నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. హైదరాబాద్ ఉత్తరం భాగంలో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రజలు చేసిన ఉద్యమానికి సీఎం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరోగమన నిర్ణయాలు తీసుకుంటూ, తెలంగాణ అభివృద్ధిని కుంటుపడేలా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణపై నిర్ణయం తీసుకున్నదని, కన్సల్టెంట్‌ను కూడా నియమించిందని గుర్తుచేశారు. ఏడాదిగా మెట్రోపై కాలయాపన చేసి చివరికి తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్నే రేవంత్ ప్రకటించారని చెప్పారు. హైదరాబాద్‌ను వరల్డ్‌క్లాస్ సిటీగా మార్చేందుకు కేసీఆర్ రోడ్‌మ్యాప్ తయారుచేశారని, ఏడాదిగా గత ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేసి ఉంటే తెలంగాణ పురోగమన దిశలో ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో తాను మారిన మనిషినంటూ రేవంత్ చెప్పినట్టు వార్తలు వచ్చాయని, అంటే ఏడాది కాలంలో తన చర్యలు తప్పు అని ఆయనే ఒప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు.
కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి వేసిన రోడ్‌మ్యాప్‌ను రేవంత్ అమలుచేయక తప్పదని, మెట్రో తాజా ప్రతిపాదనలు బీఆర్ఎస్, ప్రజలు సాధించిన విజయమని పేర్కొన్నారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు కూడా రేవంత్ పూనుకోవాలని డిమాండ్ చేశారు. పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతం లో మెట్రో విస్తరణ గురించి ఎందుకు ఆలోచించరు? అని ప్రశ్నించారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు తట్టెడుమట్టి తీయలేదని విమర్శించారు.
ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి ఎన్నో తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని, కొత్త సంవత్సరంలోనైనా తిరోగమన చర్యలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ డిమాండ్ చేశారు. 400 రోజుల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని మండిపడ్డారు. మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టులపై రేవంత్ తీరు తుగ్లక్‌ను మరిపిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాం లో తీసుకున్న నిర్ణయాలను మొదట్లో రేవంత్ రద్దు చేసి ఏడాది తర్వాత మళ్లీ వాటినే అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రేవంత్ సంపాదనలో రవ్వం త కాదు.. కొండంతగా మారారని, ఏడు తరా లు తిన్నా తరగని ఆస్తిని ఇప్పటికే పోగు చేసుకున్నారని విమర్శించారు. వ్యక్తుల మీద కక్షతో వ్యవస్థలను నాశనం చేయొద్దని హితవుపలికారు.
హైదరాబాద్ ఉత్తర భాగం మెట్రో పనులను ద్వితీయ ప్రాధాన్యంగా కాకుండా, తొలి ప్రాధాన్యంగా చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్, శామీర్‌పేటకు మెట్రో రైలు ప్రాజెక్టు అనేది కేసీఆర్ హయాంలోనే తీసుకున్న నిర్ణయమని గుర్తుచేశారు. కేంద్రం నుంచి సాయం వస్తేనే పనులు చేపడతామని అనడం సరికాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అయినా చేపట్టాలని కోరారు. మెట్రో విస్తరణ పనులు ఎప్పటివరకు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.