వారెంట్ లేకుండా సోదాలేంటి?
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): సెర్చ్ వారెంట్ లేకుండా కేటీఆర్, ఆయన బంధువుల ఇండ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి.. ఈ నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది ఇంట్లో అక్రమ మద్యం పట్టుబడితే కేసు నమోదు చేసుకోవచ్చు, కానీ భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తున్నాం
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీకాలనీ, అక్టోబర్ 27 : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో చేసుకున్న దావత్‌ను రేవ్ పార్టీ అని తప్పుడు ఆరోపణలు చేయడం తగదు.
కేటీఆర్‌ను బద్నాం చేసే కుట్ర
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే, కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
దొరికిందేమీ లేదు బీఆర్ఎస్ లీగల్ సెల్
సభ్యుడు సోమ భరత్
రాజ్ పాకాల ఇంట్లో ఎైక్సెజ్ పోలీసులు సోదాలు చేస్తే దొరికేందేమీ లేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యుడు, న్యాయవాది సోమభరత్ అన్నారు. ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ నాయకుల ఇండ్లపై దాడులు చేయించ డం దుర్మార్గమని మండిపడ్డారు.
ఈ ఆరాచకం ఏంటి?
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి
‘కుటుంబసభ్యులతో కలిసి ఇండ్లల్లో వేడుకలు చేసుకోవద్దా? ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా? ఏంటీ ఈ ఆరాచకం’ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్, బీఆర్ఎస్ను రాజకీయం గా ఎదుర్కొలేకే దౌర్జన్యం చేస్తుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు రేవ్ పార్టీ అని బ్రే కింగ్‌లు ఇవ్వడం సమంజసం కాదన్నారు.
రేవంత్‌రెడ్డీ.. కుట్రలు మానుకో
బీఆర్ఎస్ ఎన్నారై సెల్ సభ్యుడు అనిల్ కుర్మాచలం
సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపారని అనిల్ కుర్మాచలం మండిపడ్డారు. కేటీఆర్ బంధువులు ఇంట్లో విందు చేసుకొంటే పోలీసులు రేవ్ పార్టీగా చిత్రీకరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా విందులు చేసుకోలేని పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు.