BRS MLAs | హైదరాబాద్ : వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నా చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి, ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
శాసనసభ వాయిదా అనంతరం నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు పాదయాత్రగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చి.. అక్కడే నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడ్నుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇక కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించే సమయంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు.
ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత. కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేశాం. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారు. యూరియా పంపిణీ చేతగాకపోతే తప్పుకోవాలి. యూరియా ఎప్పటిలోపు పంపిణీ చేస్తారో చెప్పకపోతే ఇక్కడ నుంచి కదలం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకొని చెబితేనే ఇక్కడ్నుంచి బయటకు వెళ్తాం. మేం రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాం.
– హరీశ్‌రావు
యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారు. రైతులపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చాయి. యూరియాపై సీఎం ఒక్కరోజైనా సమీక్ష చేశారా..? మేం పార్టీ తరపున ఎక్కడా ఆందోళన చేయలేదు.. ప్రజలే ఆందోళన చేస్తున్నారు. ప్రజల ఆందోళనలను చూసైనా ప్రభుత్వం అప్రమత్తమై ఉండాల్సింది.
– నిరంజన్ రెడ్డి