హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): గజ్వేల్‌లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడమంటే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ విమర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం నిర్వహించిన దాడి అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకుల ఇండ్లపై, నేతల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ క్యాడర్‌ను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్రనేత గోసుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కేసీఆర్ క్యాంపు ఆఫీసులో బలవంతంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు పెట్టడం శోచనీయమని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల చిల్లర దాడులను బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్ హెచ్చరించారు. గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్‌కుమార్ ధ్వజమెత్తారు. గజ్వేల్ దాడి ఘటన కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.