MLA Jagadish Reddy | హైదరాబాద్ : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో జగదీశ్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల డాక్టర్ సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, చింతా ప్రభాకర్, మాణిక్ రావు ఉన్నారు.
శాననసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మార్చి 13న అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్‌రెడ్డి సభకు హాజరయ్యే అవకాశం లేదు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టగా, జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
అధికారపక్షం నుంచి మంత్రి ఏం మాట్లాడారో రాష్ట్రమంతా చూస్తున్నదని, మంత్రి మాట్లాడిన మాటలకు గవర్నర్ ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అంటూ సభలో జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సభలో తేల్చాలని సభలో ఉండుమంటే ఉంటా.. పోమ్మంటే పోతా అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని సభా సంప్రదాయాలను గౌరవించాలని, స్పీకర్‌ను బెదిరించడం సబబుకాదని, సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ఈ క్రమంలో స్పీకర్ కల్పించుకొని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి సహనంతో ఉండాలని, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని సూచించారు. దీనిపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తాను విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని బదులిచ్చారు. ‘జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ అసలే విరుద్ధం కాదు. ఈ సభ మనందరిది. ఈ సభలో అందరికీ సమానమైన హక్కులున్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.
జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. ‘సభలో సభ్యులకు సమాన అవకాశాలుంటాయి. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ప్రతిపక్ష సభ్యులకు సమాన హక్కు ఉంటుందని జగదీశ్‌రెడ్డి అన్నా రు’ అని హరీశ్ స్పష్టంచేశారు. దీంతో అధికారపక్ష సభ్యులు నినాదాలు చేశారు. జగదీశ్‌రెడ్డికి అవకాశం ఇచ్చినా అధికార పక్షం సభ్యులు అడ్డుతగిలారు. అయినా వెనక్కి తగ్గని జగదీశ్‌రెడ్డి ‘సభా సంప్రదాయాలు తేలాలె. స్పీకర్ అధికారాలు తేలాలె. సభ్యుల హక్కులు తేలాలె’ అంటూ మాట్లాడారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కలుగజేసుకొని జగదీశ్‌రెడ్డి క్షమాణలు చెప్పాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదావేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సభ్యుల డిమాండ్లతో జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.