అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసిన స్పీకర్కంచే.. చేను మేసిన విధంగా.. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితే ఇవాళ రాష్ట్రంలో దాపురించింది.జీవో 111 పరిధిలోని శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని నిబంధనలున్నా అకడ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లతో యథేచ్ఛగా నడుపుతున్నది. -హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ) : రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన మంత్రిగా ఉండేందుకు నైతికంగా అనర్హుడని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చట్టప్రకారం శిక్షార్హుడని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆయన అక్రమాలపై తక్షణం ‘అసెంబ్లీ హౌస్ కమిటీ’ వేసి విచారణ చేపట్టాలని నినదించారు. అసెంబ్లీలో గురువారం మైనింగ్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మాట్లాడుతూ 111 జీవోను తుంగలో తొక్కి యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రజాధనం లూటీని ఆధారాలతో సభ ముందు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ జనరేటర్లతో క్రషర్స్ నడుపుతూ గుట్టలు ధ్వసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు నిబంధనలకు విరుద్ధంగా పట్టుపడితే రూ.25వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించాలని చట్టం చెప్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్వాహకులను ఎందుకు ఉపేక్షిస్తున్నదని ప్రశ్నించారు.
దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలుపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రులు పదేపదే అడ్డుతగిలారు. తమ మంత్రి పొంగులేటినే అంటున్నారని కాంగ్రెస్ మంత్రులు వాగ్వాదానికి దిగారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, పొంగులేటికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ జరుగుతుంటే.. అతనిపై చర్యలు తీసుకోకుండా, తమను క్షమాపణ చెప్పమంటరా? అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇదే విషయమై మంత్రులు పదేపదే అడ్డు తగులుతూ.. హరీశ్‌రావు స్పీచ్‌కు భంగం కలిగించారు. అయితే, గతంలో ఓబులాపురం గనుల్లో జరిగిన అక్రమాలపై నాడు వైఎస్ఆర్ ఆరోపణలు చేసిన సభ్యుడినే చైర్మన్‌గా నియమిస్తూ ‘హౌస్ కమిటీ’ వేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై కూడా ‘హౌస్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, అప్పటివరకూ ఆయన నైతిక బాధ్యత వహిస్తూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు పట్టుబట్టారు.
నినాదాలు, చప్పట్లతో దద్దరిల్లిన సభ..
మంత్రి పొంగులేటి తక్షణం రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘వివ్ వాంట్ హౌస్ కమిటీ’ ‘మైనింగ్ స్కామ్ చేస్తున్న పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలి’ ‘తప్పు చేయకపోతే భయం ఎందుకు?’ ‘పొంగులేటి.. రాజీనామా చేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ నినాదాలు ఇస్తుండగా.. మిగతా సభ్యులు గట్టిగా మద్దతు పలికారు. ఈ క్రమంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదేపదే అడ్డంకులు సృష్టించారు. దీంతో పోడియం వద్ద కూర్చున్న వారికి మద్దతుగా మాజీ మంత్రులు కేటీఆర్, పద్మారావుగౌడ్, మల్లారెడ్డి, తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, అనిల్‌జాదవ్ తదితరులు వారి పక్కనే నిలబడి నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనతో నేరుగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది.
అర్ధాంతరంగా సభ నేటికి వాయిదా
నినాదాలు, నిరసనలతో రెండు గంటలుగా బీఆర్ఎస్ సభ్యులు రెండు గంటల పాటు సభను స్తంభింపచేశారు. ప్రతిపక్షం పూర్తి ఆధారాలతో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవా కన్స్ట్రక్షన్స్ అవినీతిని బయటపెట్టడంతో అధికారపక్షం ఒక్కసారిగా అవాకయింది. దానిని కవర్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, విప్‌లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడ్డారు. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో దిగొచ్చిన రేవంత్‌రెడ్డి.. పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సీబీసీఐడీ విచారణ జరిపిస్తాం అంటూ సభలో ప్రకటన చేశారు. దీంతో పద్దులపై ఎలాంటి చర్చ లేకుండానే అర్ధాతరంగా శాసనసభను ప్యానల్ స్పీకర్ బాలునాయక్ ఆదివారానికి వాయిదా వేశారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యలు నినాదాలు చేసుకుంటూ లాబీల్లోకి వచ్చారు. అక్కడ కూడా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటి రాజీనామా చేయాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ఎల్పీ వద్ద భారీగా పోలీసులతో మోహరించారు.
ఆరుగురు మంత్రులు.. 15 సార్లు అడ్డగింత
మైనింగ్‌శాఖ పద్దులపై చర్చ బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు మాట్లాతుండగా ఆరుగురు మంత్రులు సుమారు 15సార్లు అడ్డుతగిలారు. అయినా, కాంగ్రెస్ మంత్రులకు, విప్‌లకు ఆయన దీటుగా సమాధానం చెప్పారు. ఆధారాలతో సహా చెప్పి, అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. సభలో హరీశ్‌రావు స్పీచ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కల్పించుకొని.. అసెంబ్లీలో ఆ అంశం మరొకసారి మాట్లాడొద్దు అంటూ పద్దులపైనే మాట్లాడాలని డైవర్ట్ చేశారు. దీంతో ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న బాలునాయక్ కూడా పద్దులపైనే మాట్లాడాలని హరీశ్‌రావుకు సూచించారు. ఇక బీఆర్ఎస్ ప్రస్తావించిన అంశం తమకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన మైనింగ్‌శాఖ మంత్రి వివేక్.. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. అక్రమ క్రషింగ్‌పై రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు ఇచ్చినట్టు తనకు ఇప్పటివరకు తెలియదని నోరు జారారు. దీన్ని కవర్ చేసుకునేందుకు వెంటనే మైక్ అందుకున్న మంత్రి శ్రీధర్‌బాబు.. ఈ అక్రమ మైనింగ్‌లో ఉన్నది ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే హరీశ్‌రావుకు మైక్ రావడంతో.. ‘నేను అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరి తీయండి.. శాసన సభ్యుడిగా సస్పెండ్ చేయండి’ అని సవాల్ విసిరారు. అదే సమయంలో తాను చెప్పింది నిజమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారిక డాక్యుమెంట్లు, డేటా ఆధారంగా తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి మరో న్యాయం ఉంటుందా? అని నిలదీశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని సూచించారు. ఆ వెంటనే మంత్రి వివేక్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి కల్పించుకొని గత ప్రభుత్వంలోనూ మైనింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేకుండా పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత పర్యావరణ సంస్థల నుంచి నోటీసులు అందుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్వాహకులను ఎందుకు అరెస్టు చేయరు? అని డిమాండ్ చేసినప్పుడు మళ్లీ మైక్ కట్ చేశారు. అప్పుడు శ్రీధర్‌బాబు మైక్ అందుకొని హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని కొత్తరాగం అందుకున్నారు. ఒక్కసారిగా పొంగులేటికి మద్దతుగా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్కలు అడ్డుతగిలారు. అయినా మైక్ ఇవ్వకుండా మళ్లీ వివేక్, శ్రీధర్‌బాబు, శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్‌లు పొంగులేటిని అనుకూలంగా మాట్లాడారు. హరీశ్‌రావుకు మైక్ ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష నుంచి నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ ఆధారాలతో సహా సభలో వెలుగుతీసిన అక్రమాలను కవర్ చేసేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి రావాల్సి వచ్చింది. వచ్చీ రావడంతోనే అధికారుల వద్దకు వెళ్లి పలు అంశాలపై రిపోర్టులు కోరారు. సీఎం కూడా రిపోర్టుల కోసం సుమారు 15 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది.
రేవంత్ ఇన్.. పొంగులేటి ఔట్
హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై అసెంబ్లీ హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. అప్పటివరకు సభలోనే ఉన్న మంత్రి పొంగులేటి.. సీఎం రేవంత్‌రెడ్డి సభలోకి రాగానే వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ సభలోకి రాలేదు. ఇలా సీఎం సభలోకి రావడం, పొంగులేటి వెళ్లిపోవడంపై అక్కడ చర్చ జరిగింది. తనపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో ఉండడం పద్ధతి కాదనే ఉద్దేశంతోనే ఆయన బయటికి వెళ్లిపోయారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అంతకుముందు వరకు ఆయనపై చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు సభలోనే ఉన్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశిస్తారని, సీబీసీఐడీ విచారణ వేస్తారనే విషయం తెలిసే పొంగులేటి సభ నుంచి వెళ్లిపోయారనే చర్చ జరుగుతున్నది.
పోడియం వద్ద కూర్చొని నిరసన
రాఘవ కన్స్ట్రక్షన్స్కు మంత్రి పొంగులేటికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్టేట్మెంట్ ఇవ్వడంపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ వెంటనే మైక్ అందుకున్న హరీశ్‌రావు.. ‘నేను చెప్పే మాటల్లో అబద్ధమైతే నన్ను ఉరి తీయండి.. లేదంటే సభ నుంచి సస్పెండ్ చేయండి. నా ఆరోపణలు నిజమైతే.. వెంటనే పొంగులేటితో రాజీనామా చేయించండి’ అని డిమాండ్ చేశారు. ఇందుకు కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరిగా కలుగజేసుకుంటూ పదేపదే హరీశ్‌రావుకు అడ్డుతగులుతుండటం, స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన తెలిపారు. హరీశ్‌రావుకు మైక్ ఇవ్వాలని, హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, బండారు లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్, కేవీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు స్పీకర్ పోడియం వద్ద కూర్చొని నిరసన తెలిపారు. చీఫ్ మార్షల్ సభలోకి వచ్చి.. మరింత మంది మార్షల్స్‌తో మోహరించారు. శాంతియుతంగానే పోడియం వద్ద నిరసన తెలుపుతుండగా.. 12 మంది మార్షల్స్‌ను రంగంలోకి దించారు.