BRS | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా ముంచిందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఊదరగొట్టి చిత్తు కాగితాలను అసెంబ్లీ ముందుంచిందని ధ్వజమెత్తింది. ‘బోగస్ బోగస్..కాంగ్రెస్ బోగస్’ అని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపింది. సర్కారు ప్రకటించింది జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ తూర్పారబట్టింది. నిరసనగా అసెంబ్లీ నుంచి గన్‌పార్క్‌లోని అమవీరుల స్తూపం వరకు ర్యాలీ తీసింది.
నిరుద్యోగులకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. నిరుద్యోగులకు సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా వెంటపడతామని హెచ్చరించింది. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయనను సభనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఏ అభ్యర్థనూ స్పీకర్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.
శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేసిన వెంటనే దానిపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో కేవలం ప్రకటన మాత్రమే చేస్తారా? చర్చ అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్లో కనీసం రెండు ఉద్యోగాల సంఖ్య కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో భట్టి విక్రమార్క స్పందిస్తూ సభలో ప్రకటించే స్టేట్మెంట్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, చర్చకు కూడా ఆస్కారం లేదని, సభావ్యవహారాల నియామవళిని చదివి వినిపించారు. లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంతపెద్ద అంశాన్ని ఒక్క మాటలోనే తేల్చేస్తారా? అని కేటీఆర్ మండిపడ్డారు.
అయినా మారుమాట్లాడకుండానే సభనుంచి భట్టి వెళ్లిపోయారు. ఆయన వెళ్తుండగా ‘ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగులను మోసం చేశారు. కనీసం 2 ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్లో చూపలేదు. ఇంతకంటే ముఖ్యమైన సబ్జెక్ట్ ఏముంటుంది? మాట్లాడేందుకు కనీసం 2 నిమిషాల సమయం ఇవ్వండి’ అంటూ కేటీఆర్ పోడియం ముందుకు వెళ్లి అభ్యర్థించారు.
మిగతా సభ్యులు కేటీఆర్‌ను అనుసరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతులు జోడించి అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసినా స్పీకర్ నిరాకరించారు. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల విజ్ఞప్తితో కూడిన నిరసన తెలుపుతుండగా స్పీకర్ పట్టించుకోకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడేందుకు అనుమతించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సర్కారు తీరుపై నిరసన తెలిపారు. ‘నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది.. షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశారు. మాట్లాడేందుకు స్పీకర్ ఎంతకూ అవకాశం ఇవ్వకపోవడంతో సభనుంచి బయటకు వచ్చారు.
జాబ్ క్యాలెండర్ విషయంలో సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు చేసిన నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం మార్మోగింది. ‘బోగస్..బోగస్..జాబ్ క్యాలెండర్ బోగస్, నహీ చలేగా నహీ చలేగా..తానా షాహీ నహీ చెలేగా, మోసం మోసం..కాంగ్రెస్ మోసం’ అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం దద్దరిల్లింది.
అసెంబ్లీ లాబీ నుంచి బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటడంతో మార్షల్స్ సహా భద్రతా సిబ్బంది, పోలీసులు వచ్చి అనుసరించారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ గన్‌పార్క్ దాకా ర్యాలీ తీశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం సహా బయట ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
జాబ్‌క్యాలెండర్‌పై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేసిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి లేరు. ప్రకటన చేసిన మరుక్షణమే భట్టి కూడా బయటకు వెళ్లిపోవడంతో జాబ్‌క్యాలెండర్‌పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని బీఆర్ఎస్ విమర్శించింది.
అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు, అస్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదలను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యేలతో పోలీసులు వాగ్వాదానికి దిగుతున్న సమయంలోనే అమరవీరుల స్తూపం చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా ఒక్కొక్కరిని వాహనాల్లో లాక్కెళ్లారు. పోలీస్ బస్సుల్లో తెలంగాణ భవన్‌కు, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్‌పార్క్ పరిసర ప్రాంతాల్లోకి నిరుద్యోగులు రాకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ దారుణమైన పదజాలంతో దుర్మార్గంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జాబ్‌క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశించారు. బీఆర్ఎస్ నాయకులపై, మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యపదజాలతో మాట్లాడడం శోచనీయమని వాపోయారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అమీర్‌పేట ప్రాంతాల్లో తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.
కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవ లక్ష్మి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కోవ లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జాబ్‌క్యాలెండర్ ప్రకటన, సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది తెలంగాణ అసెంబ్లీకి చీకటి రోజుగా అభివర్ణించారు. శాసనసభ నుంచి దానంను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.