Vivekananda | వెనుకబడిన కులాల వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణన సర్వేను బీఆర్ఎస్ తప్పు బడుతుందని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కాడని ఆరోపించారు.
బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశాడని వివేకానంద గౌడ్ వ్యాఖ్యానించారు. బీసీలను మోసం చేసినందుకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని తిరగనియ్యం అని స్పష్టం చేశారు.సిగ్గు లేకుండా ఈరోజు తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని రేవంత్ రెడ్డి ప్రకటించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాలు తిరగనివ్వబోవని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం గాంధీ భవన్ లోనే ఆత్మహత్యలు చేసుకున్నారని వివేకానంద గౌడ్ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం చేసిందేమీ లేదన్నారు.