Vemula Prashanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ గూండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం.. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ప్రభుత్వాన్ని అడిగాను. గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు ఇంకా నియోజకవర్గంలో రానివారు ఉన్నారు వారికి ఇవ్వాలని ప్రభుత్వంను అడగటం జరిగింది. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగటం నా బాధ్యత.. ఇందులో తప్పేముంది? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
దీనికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానాల మొహన్ రెడ్డి మా ఇంటి మీదికి వస్తా అని సవాల్ విసిరాడు. ఇవాళ మా ఇంటి మీదకి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు. మానాల మొహన్ రెడ్డి కడుపు సల్లబడిందా? మానాల మోహన్ రెడ్డి మీ ఐడేంటిటి కోసం నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకి జరిగే లాభం ఏంటి.. ఒరిగింది ఏంటి? గత 10 ఏండ్లలో మా కేసీఆర్ను, మమ్మల్ని ఇదే మానాల మొహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు అన్నారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాపై వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడినాడు. మేము మీరు చేసినట్టు ఇంటి మీదకి పోయినామా..? ఇది సభ్యతనా..? రాజకీయాల్లో ఇది మంచిదా..? బాల్కొండ ప్రజలు ఆలోచించండి అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
మానాల మోహన్ రెడ్డి మీకు ఒక సూచన చేస్తున్న.. మీరు మా ఇంటిపై దాడికి రావడమో లేదా మా వాళ్ళు మీ ఇంటికి రావడమో, రాజకీయ సన్యాసము తీసుకోవడమో లాంటివి టైం పాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజలకు కావాలి. ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఇది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు. నేను గల్ఫ్ కార్మికుల పక్షాన వారి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అభినందించాల్సింది పోయి దేవేందర్ రెడ్డి వారి అనుచరులతో అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా..? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.