Vemula Prashanth Reddy | హైదరాబాద్ : నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ సభపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ నిజమాబాద్‌లో అమిత్ షా ప్రోగ్రాం చూస్తే సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పే కవిత్వం లాగా మా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నటు ఉంది బీజేపీ తీరు అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇంతకు ముందే ప్రారంభించిన పసుపు బోర్డ్ తాత్కాలిక కార్యాలయంను మరొక బిల్డింగ్‌లోకి మార్చి దేశ హోంమంత్రి అమిత్ షాతో మళ్ళీ ప్రారంభిస్తుంటే జిల్లా పసుపు రైతులు నవ్వుకుంటున్నారు. పసుపు రైతులకు కావాల్సింది తాత్కాలిక కార్యాలయాలు మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తూ ఏమార్చడం కాదు.. ఆరుగాలం కష్టపడి నిష్టతో పండించిన పసుపు పంటకు మద్దతు ధర రావాలి. ఇవ్వాలా అమిత్ షా ప్రసంగంలో రాజకీయ అంశాలు తప్ప మద్దతు ధర విషయం, బోర్డుకు నిధుల విషయం, శాశ్వత భవన విషయం ఏమి లేవు. ఇట్లా మొదటి నుండి బీజేపీ పసుపు రైతులను మాయ మాటలతో మోసం చేస్తూనే ఉంది. జాతీయ పసుపు బోర్డు కోసం, పసుపుకు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేశారు అని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు పోరాటంతో రైతులు జాగృతం అయ్యారు. 2014 నుండి 18 వరకు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలుగా మేము పోరాటం చేసిన కేంద్ర ప్రభుత్వము సహకరించలేదు. 2019 ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామని బాండ్ పేపర్‌పై రాసి బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చి గెలిచాడు. 2022లో పసుపు బోర్డు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయంగా బీజేపీకి ఇబ్బంది అవుతది అని.. హామీ ఇచ్చిన 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్ల కోసం.. 2023 అక్టోబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. సంవత్సర కాలం ప్రకటనలకు పరిమితమైనారు. చివరికి 2025 జనవరి 14న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును మొదటి సారి ప్రారంభించారు. బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని చైర్మన్‌గా నియమించారు. అప్పటికే కిరాయి భవనంలోనే కొనసాగుతున్న స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తాత్కాలిక జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా మార్చారు. కానీ 2025 మార్చి కేంద్ర బడ్జెట్లో రబ్బర్ బోర్డు, స్పైసెస్ బోర్డు వంటి ఇతర బోర్డులకు నిధులు కేటాయించినట్లు నిజామాబాద్ పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. నిధులు లేకుండా, ఈ బోర్డు రైతులకు ఏం చేస్తుంది? బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొన్న సీజన్లో పసుపు ధర ఎక్కువ శాతం 8000 – 10000 పలికింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు బీజేపీపై కోపముంది. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఉన్నట్టుండి పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి మళ్లీ బీజేపీ తెర తీసి మళ్ళీ ఒక డ్రామా ఆడింది ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఈ రోజు అమిత్ షా తాత్కాలిక కార్యాలయాన్ని మళ్ళీ రెండోసారి అధికారికంగా ప్రారంభించారు. నన్ను కానీ పార్లమెంట్లో పసుపు బోర్డ్ పై ప్రవేట్ బిల్ పెట్టిన సురేష్ రెడ్డిని ఎవ్వరు పిలవలేదు.ఎదో నామమాత్రంగా నిన్న రాత్రి కార్డు పంపించారు. 2వ తాత్కాలిక కార్యాలయం కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే బోర్డుకు ధిక్కయి, దాన్నే అద్దె ప్రాతిపదికన కిరాయి తీసుకొని ఉపయోగించడం బీజేపీ చేతకానితనానికి నిదర్శనం. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను మొన్నటి ఎన్నికల్లో గెలిపిస్తే తెలంగాణకు నయా పైసా తెచ్చింది లేదు. ఇప్పుడు అమిత్ షా లాంటి నేత రాష్ట్రానికి వస్తే చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఏదో ఉండాలన్న కారణంతోనే ఆల్ రెడీ ఒపెన్ అయిన ఆఫీస్‌నే ఇంకోసారి అమిత్ షాతో రీ ఓపెన్ చేయిస్తున్నారు.ఇది రైతుల్ని మోసం చేయడమే. సాధారణంగా ఏదేని వాణిజ్య పంటలకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేస్తే అందుకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ బాడీని నియామకం చేయాలి. ఇప్పటి వరకు పసుపు బోర్డుకు ఛైర్మన్, సీఈవోను మాత్రమే నియామకం చేశారు. ఉదాహారణకు కొచ్చిలో 1981లో కొకొనట్ బోర్డును నెలకొల్పారు. దీనికి 50 మందితో కార్యనిర్వాహక వ్యవస్థ పని చేస్తుంది. బోర్డు ఏర్పాటు అయ్యి ఆరు నెలలైన ఆఫీస్ లో చైర్మన్, సీఈవో ఇద్దరే ఉన్నరు. పసుపు బోర్డుకు పాలకవర్గం నియామకం జరగలేదు. ఛైర్మన్ పోస్టును బీజేపీ నాయకుడికి కట్టబెట్టి చేతులు ముడుచుకున్నారు. జాతీయ పసుపు బోర్డుకు పాలకవర్గంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటుగా పసుపు రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులను సభ్యులుగా నియమించాలి. ఖర్చుతో సంబంధం లేకున్నప్పటికీ పాలకవర్గమే దిక్కు లేదు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
స్పైసెస్ బోర్డు, టొబాకో బోర్డు, కొకొనట్ బోర్డు ఇలా దేశంలో యాభైకి పైగా బోర్డులను స్థాపించేందుకు పార్లమెంట్లో చట్టం చేశారు. విచిత్రంగా పసుపు బోర్డును మాత్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సర్క్యులర్ తో ఏర్పాటు చేశారు. పసుపు రైతుల పట్ల బీజేపీకి నిబద్ధత ఉంటే ఇలా చేయరు. అంత డ్రామా ! మోసం. బోర్డు ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు. శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి, దానికి తగినన్ని నిధులు ఇవ్వాలి. పాలకవర్గాన్ని, ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేయాలి. పసుపుకి మద్దతు ధర లేదు. పసుపుకి క్వింటాలుకు 15000 మద్దతు ధర ప్రకటించి వచ్చేలాగా ఈ బోర్డు ప్రయత్నం చేయాలి. లేకుంటే ఈ బోర్డ్, బోర్డు ఆఫీస్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు. మన దేశంలో ఇప్పటికి కూడా జీడి, కొబ్బరి, కాఫీ బోర్డులు, ఆయా పంటల ధరలు తగ్గినప్పుడు అవే స్వయంగా పంటను MSP కి కొని అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేస్తాయి. పసుపు విషయంలో కూడా ఈ బోర్డు కూడా అలా చేయాలి. అప్పుడే బోర్డు ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. ఇవాళ అమిత్ షా నిజమాబాద్ మీటింగ్‌లో పసుపు క్వింటాలుకు 1500 కనీస మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశగా ఎదురు చూశాం.. నిరాశే మిగిలింది.. ఇప్పటికైనా ఈ కాలక్షేపం కార్యక్రమం బంద్ చేసి.. వచ్చే సీజన్ నుండే.. పసుపుకు MSP ప్రకటించి, వడ్లు ఎట్లనైతే కొంటున్నారో అట్ల పసుపుకు కూడా 15000 క్వింటాలుకు మద్దతు ధర ఇచ్చి పసుపు బోర్డే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.