Talasani Srinivas Yadav | కొల్లాపూర్ : మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు సోమశిలలో ఘన స్వాగతం లభించింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కుమార్ యాదవ్కు బీఆర్ఎస్ నేతలు పూలమాలలు, శాలువాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. శ్రీనివాస్ యాదవ్ తన వియ్యంకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూల రాజ్ కుమార్ గౌడ్ ఇటీవల మరణించగా, శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిలలో గల కృష్ణా నదిలో అస్థికలు కలిపేందుకు వచ్చారు. విఐపి ఘాట్ వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం లాంచీలో సప్త నదులు కలిసే సంగమం వద్ద అస్థికలను గంగాజలంలో కలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. కొల్లాపూర్ ప్రాంతానికి గతంలో తాను వచ్చినట్లు గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి అవసరమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు పార్లమెంట్లో పెట్టాలన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొల్లాపూర్ రావడంతో బీఆర్ఎస్ స్థానిక నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో బీసీల గొంతుకగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని, బీసీ రిజర్వేషన్లు పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ లేవనెత్తిన అంశాలు రాష్ట్రంలోని బీసీలను చైతన్యం చేశాయని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, స్థానిక బిఆర్ఎస్ నేతలు సింగిల్ విండో చైర్మన్ విజయరామరావు, మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కాటం జంబులయ్య, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సాంబశివుడు యాదవ్, పెంట్లవెల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, రాజేష్, సురేంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, యాదవ సంఘాల నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు.