MLA Sabitha | హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కేటాయిస్తారా లేదా అని నిలదీశారు.
ఒక వైపు డబ్బులు లేవంటూనే ఉస్మానియా విశ్వ విద్యాలయానికి వెళ్లి ఎన్ని నిధులు కావాలో చెప్పండి అన్న సీఎం గారు.. ఆ నిధులతో పాటు ఇప్పటి వరకు బకాయిపడ్డ రూ. 10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయండి అని ఆమె డిమాండ్ చేశారు.
ఈ నెల 15 నుండి వృత్తి విద్య కళాశాలలు, 16 నుండి డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ చేస్తామంటున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంటర్ కళాశాలల పరిస్థితి కూడా అంతే.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రయివేట్ కళాశాలలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక, అద్దె ఇతర ఖర్చులకు నిధులు లేక మూత పడే స్థాయికి వచ్చాయి. హాజరు శాతం,ఉత్తీర్ణత అంటూ కొర్రిలు పెడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్లు? చాలా కళాశాలల్లో ఫీజు బకాయిలు ఉన్నందున యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు.. కొంత మంది డబ్బులు కట్టి తీసుకుంటున్నారు అని సబిత తెలిపారు.
రాష్టానికి ఒక్క రూపాయి ఆదాయం రాని కరోనా సమయంలోనూ విద్యార్థులకు సంభంధించిన నిధులు ఆపలేదు. కేసీఆర్ మీద కోపంతో గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు.. సరైన తిండి, వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున కళాశాలలు మూతపడుతున్నాయి. వేల కోట్ల కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూనే ఉపాధ్యాయుల, ఉద్యోగుల టిఏ, డిఏలకు డబ్బులు లేవంటూన్నారు. ఇదెక్కడి న్యాయం సీఎం గారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల విదేశీ విద్యను సాకరం చేసే ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు వెంటనే విడుదల చేయండి. ఇప్పటికైనా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి ముఖ్యమంత్రి గారు అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు.