MLA Prashanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు. వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో ప్రజలకు స్వయంగా కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రవౄంత్ రెడ్డి పంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు బాకీ ఉన్న హామీలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం” ను బాల్కొండ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా చేపడతామని ఎమ్మెల్యే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, వంచనను బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ “బాకీ కార్డు” రూపంలో ప్రజల్లోకి తీసుకు వస్తోందని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని ఎమ్మెల్యే అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు. ప్రజలను నమ్మించడానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు అని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
పథకాల అమలు తక్కువ… ప్రచారం ఎక్కువ అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది. ఆనాడు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేస్తాం అంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గ్యారంటీ కార్డులు ఇచ్చి మోసం చేసిందో ప్రజలకు వివరిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజల పక్షాన నిలదీసి కోట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, వివరిస్తూ అవగాహనా కల్పించాలి అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.