హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరత మొదలైందని దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మళ్లీ రైతులు క్యూలెన్లలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులుగా సమీక్షలు, ఢిల్లీ పర్యటనల పేరిట సమయం వృథా చేస్తున్నదని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గెలిచినా ఓడినా తమది ప్రజాపక్షమేనని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జహీరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్, జెడ్పీ చైర్మన్లు రాజు, శోభతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకాలను రద్దు చేస్తున్నారు తప్ప, కొత్త పథకాల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారని, ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గృహలక్ష్మి లబ్ధిదారులను ఇందిరమ్మ పథకం కిందకు చేర్చి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరే హామీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రైతుబంధు ఇంకా ఎవరికీ సరిగా అందలేదని, రైతు రుణమాఫీ గురించి ఊసే లేదని విమర్శించారు. వడ్లకు బోనస్ ధర ఏదని నిలదీశారు. ఇలా దగా చేసిన ప్రభుత్వాన్ని ఎపుడూ చూడలేదని చెప్పా రు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని మండిపడ్డారు. దీర్ఘకాలిక హామీలపై తాము అడగడం లేద ని, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యల గురించే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేయొద్దని హితవు చెప్పా రు. ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయని, దరఖాస్తుల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టారు తప్ప వారికి ప్రయోజనం కలగలేదని దుయ్యబట్టారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని, ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరితో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చే దాకా కాలయాపన చేసి, ఏడాది దాకా హామీలను ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తున్నదని పేర్కొన్నారు.