Palla Rajeshwar Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దుట్నుంచి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారని.. అధికారులు కూడా సీఎం అబద్ధాలను చూసి సిగ్గుపడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ అని మండిపడ్డారు. ఇంత అసభ్యంగా మాట్లాడే సీఎం దేశంలో మరొకరు లేరని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, అవాస్తవాలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 30 వేల ఉద్యోగాలపై, సీతారామ సాగర్‌పై ముఖ్యమంత్రివి, ఇతర మంత్రులవన్నీ అబద్ధాలే అని అన్నారు. రాష్ట్రంలో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అంటున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.7400కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ సర్కార్ అని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది.. పైసలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టును కేసీఆర్ ఆపమంటే ఆపారని ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని పల్లా మండిపడ్డారు. దుమ్ము గూడెం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే ఖమ్మం జిల్లా దుమ్ము కొట్టుకుపోయేదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే చెల్లదని అని స్పష్టం చేశారు. 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ మొదలుపెట్టారని తెలిపారు. కేసీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టునే ఇవాళ కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. కృష్ణా జలాలపై కూడా ముఖ్యమంత్రివి అబద్ధాలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు.
రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అతి పెద్ద మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రుణ మాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని మొదట అన్నారని.. ఆ తర్వాత 31 వేల కోట్లు అన్నారని.. ఇప్పుడు వేసింది 17 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. రేవంత్ రెడ్డి మెడలు వంచి హరీశ్‌రావు రుణమాఫీ చేయించారని అన్నారు. దేవుడి మీద ఒట్లు.. లేకపోతే తిట్లు అనేదిఈ ముఖ్యమంత్రి వైఖరిగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి భాషను పశువులు కూడా సహించవని అన్నారు. రేవంత్ రెడ్డిలా చిల్లర చిచోరా భాష మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డొస్తుందని పేర్కొన్నారు.