వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని చెప్పారు. బీఆర్ఎస్ టికెట్‌తో వచ్చిన కడియం శ్రీహరికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వెయ్యాలని ఇంట్లో మీటింగ్ పెట్టి చెప్పానని, నియోజకవర్గం మొత్తం మద్దతు ఇచ్చామని చెప్పారు.
బీఆర్ఎస్ టికెట్, బీఆర్ఎస్ శ్రేణుల మద్దతుతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవరకు నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజ య్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం 15 రోజులుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, రాజయ్య, నాపైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కడియం బూతు మాటలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 15 మందిపై కేసులు పెట్టారు. కడియం బాగో తం బయటపెట్టిన నాపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. పార్టీ మారిన వారిలో తాను మొదటి వాడిని కాదని, బీఆర్ఎస్ ఫిరాయింపులు చేసిందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చట్ట ప్రకారం 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేశారు. చట్ట వ్యతిరేకంగా పార్టీలు మారలేదు.
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విషయం సుప్రీంకోర్టులో ఉన్నదని అంటున్నారు. ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని చెప్పింది. చట్టం తెలిసిన కడియం శ్రీహరి నైతికత ఏమైంది? రాజకీయ జన్మ ఇచ్చిన ఎన్టీఆర్‌ను, పెద్దచేసిన చంద్రబాబును, పునర్జన్మ ఇచ్చిన కేసీఆర్‌కు కడి యం పంగనామాలు పెట్టిండు. ఇప్పుడు కొత్త గురువు రేవంత్‌రెడ్డికీ అదే చేస్తున్నాడు. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కుదరదు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్తనని కడియం చెప్పుకునేదంతా అబద్ధమే. 2001లో దేవాదుల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు.
2004 వరకు కడియం మంత్రిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో దేవాదుల వద్ద తట్ట మట్టి తియ్యలేదు. 2014 నుంచి 2023లో కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లిచ్చి, 5.14 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది. దేవాదులలోని ఎత్తయిన ప్రాంతాలకు నీళ్లి చ్చేందుకు కేసీఆర్ మరో రూ.104 కోట్లు ఇచ్చారు. దేవన్నపేట పంపుహౌజ్‌లో పెట్టిన మోటర్లను ఆన్ చేయలేని దద్దమ్మ శ్రీహరి. కడియం కొత్తగా తెచ్చినట్టు చెప్తున్న డిగ్రీ కాలేజీ, వందల పడకల దవాఖాన బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినవే. రూ.800 కోట్లతో ఎనిమిది పైసల పని చెయ్యలేడు. కడియం భూముల గురించి అందరికీ తెలుసు. ఆంధ్రా అల్లుడు, అధికారులు కలిసి భూములను కబ్జా చేస్తున్నారు. రాంపూర్‌లో పెట్రోల్ బంకు, ఆర్ఎంసీ ప్లాంటు, రఘునాథపల్లి, జఫర్‌గఢ్‌లో వెంచర్లు, దేవునూర్‌లో 28, ముప్పారంలో 27 ఎకరాలు, అడవి పక్కన భూములు కొన్నదీ తెలుసని అన్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే కడియం శ్రీహరి ఆ పార్టీలో ఉంటారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కేసీఆర్‌కు కడియం ద్రోహం చేశారని చెప్పారు. కడియం కూతురుకు వరంగల్ లోక్‌సభ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ మారి నైతికంగా దిగజారాడని విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిస్తేనే ప్రజలు నమ్ముతారని తెలిపారు.