Padi Kaushik Reddy | హైదరాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని వంగర గురుకుల స్కూల్లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు వార్డెన్ వేధింపుల వల్లే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
శ్రీవర్షిత అనే అమ్మాయి వంగర గురుకుల స్కూల్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వంగర గురుకుల స్కూల్ వస్తుంది. శ్రీవర్షిత హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన
అమ్మాయి. మంత్రి నియోజకవర్గంలో విద్యార్థిని చనిపోతే ప్రభుత్వం స్పందించలేదు అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
స్కూల్లో ఉన్న గ్రాసరీస్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తీసుకువెళ్తుంటే శ్రీవర్షిత చూసింది. ఈ క్రమంలో శ్రీవర్షితను విపరీతంగా టార్చర్ చేశారు. 6:30 గంటలకు ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడి.. 7:30 గంటలకు సూసైడ్ చేసుకుంది. శ్రీవర్షిత డెడ్ బాడీని ట్రాక్టర్లో తీసుకువెళ్లారు. ఇప్పటివరకు గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయారు. శ్రీవర్షితను టార్చర్ చేసిన స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి. శ్రీవర్షిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. సైదాపూర్ స్కూల్లో విద్యార్థులను ఎలుకలు కరిస్తే పట్టించుకున్న నాధుడు లేడు. గురుకుల ప్రిన్సిపాల్స్, టీచర్ల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నారా..? అని కౌశిక్ రెడ్డి నిలదీశారు.